అప్పడాలు అమ్ముతున్న హృతిక్‌

291

బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూపర్‌ 30’. వికాశ్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బిహార్‌కు చెందిన మ్యాథమెటీషియన్‌ ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కాగా, హృతిక్ రోషన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఓ ఫొటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అందులో ఆయన అప్పడాలు అమ్ముతూ కనిపించారు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆనంద్‌కుమార్‌ తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. చదువుకోవడం కోసం అప్పడాలు సైతం అమ్మారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలో హృతిక్‌ వేషధారణ అత్యంత సహజంగా ఉంది. ‘ఆనంద్‌కుమార్‌ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించక ముందు అప్పడాలు కూడా అమ్మారు. అది ఆయన జీవితంలో ఒక ముఖ్య ఘట్టం’ అని హృతిక్‌ ట్వీట్‌ చేశారు. ‘సూపర్‌30’లో మృణాల ఠాకూర్‌, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పీవీఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.