ప్రేమికులు కుదురుగా ఒక చోట ఉండరు. ప్రపంచం, ప్రకృతి వాళ్ల కళ్లకు కొత్తగా, అందంగా కనిపిస్తుంది. దీంతో ఆ ప్రేమ పక్షులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటాయి.
పార్క్‌లని, సినిమా థియేటర్లని, బీచ్‌లని ఒక్కటేంటి అన్ని ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఓ జంట మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ జంట తన చేతులను చెయిన్‌తో కట్టేసుకుని గడుపుతోంది.
వీళ్లిద్దరు కలిసే పడుకుంటున్నారు.. భోజనం చేస్తున్నారు. చివరికి వాష్ రూమ్‌కు కూడా కలిసే వెళుతున్నారు.
వీళ్లు ఈ చెయిన్‌ను ఎందుకు తీయడం లేదు? వివరాల్లోకి వెళితే… ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్, విక్టోరియా భగ్న ప్రేమికులు. ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ.
అయితే తమ ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పాలని భావించారు. అందుకు ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. చెయిన్ అటాచ్‌మెంట్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజెప్పాలని భావించారు.
వెంటనే ఉక్రెయిన్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. ఈ నెల 14వ తేదీన వీరిద్దరినీ యునిటి స్కల్‌ప్చర్ ఇన్ కివ్ వద్ద చెయిన్‌తో బంధించారు.
వీరిని చెయిన్‌తో బంధించేముందు వారి మానసిక పరిస్థితిని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరీక్షించారు.
వారి మానసిక స్థితి బాగుందని నిర్ధారించుకున్న తర్వాత గొలుసులతో కట్టేశారు. చెయిన్ లింక్‌లను వెల్డింగ్ చేసేశారు. తొలి పరీక్షలో వీరిద్దరు 325 మైళ్లు ట్యాక్సీలో ప్రయాణించారు.
కలిసి భోజనం చేశారు. కలిసే వాష్ రూమ్‌కు కూడా వెళ్లారు. వీరిని చూసి ముందుగా ఆశ్చర్యపోయిన జనాలు అసలు విషయం తెలిసిన తర్వాత నవ్వుకున్నారు.
మూడు నెలల వరకు ఇలాగే కలిసి ఉంటామని, విజయం సాధించి గొప్ప ప్రేమికులుగా రికార్డు సాధిస్తామని అలెగ్జాండర్, విక్టోరియా నమ్మకంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.