చాయ్‌వాల కూతురు కి 3.8 కోట్ల స్కాలర్‌షిప్‌

924
tea-seller-daughter-got-scholarship

చాయ్‌ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పేద తండ్రి కలలను ఆ చిన్నారి నేరవేర్చింది. స్కూలు ఫీజు కట్టలేకపోవడంతో స్కూలు నుంచి బయటకు పంపించేసిన ఆ అమ్మాయే ప్రస్తుతం పన్నెండో తరగతిలో 98 శాతô మార్కుల్ని తెచ్చుకుని జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది. ఆ కష్టమే ఆమెకు 3.8 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను తెచ్చిపెట్టింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక బాబ్సన్‌ కాలేజీ (మాసాచుసెట్స్‌)లో చదివే అవకాశాన్నీ అందించింది.



 

ఆమే ఉత్తర్‌ప్రదేశ్‌ బులంద్‌షహర్‌కు చెందిన సుదీక్షా భాటి. నిరుపేద కుటుంబం. తండ్రి రోజంతా టీలు అమ్ముతూ… ఆ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఇదీ సుదీక్ష నేపథ్యం. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు స్కూల్‌ ఫీజు కట్టకపోవడంతో ఆ స్కూలు యాజమాన్యం సుదీక్షను ఇంటికి పంపించేసింది. తరువాత తండ్రి ఆమెను ఊర్లోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. దీంతో డబ్బు కట్టలేకే ఆ స్కూలుకి వెళ్తున్నావు అంటూ స్నేహితులూ, చుట్టుపక్కలవాళ్లు హేళనచేసేవారు. అసలు ఆడపిల్లలకు చదువెందుకూ అన్నవాళ్లూ లేకపోలేదు. ఈ అవమానాల్ని లెక్కచేయలేదు సుదీక్ష. ఇష్టంగా చదవడం మొదలుపెట్టింది. రాత్రీ, పగలూ తేడా లేకుండా కష్టపడింది. మంచి మార్కులతో అయిదో తరగతి పాసైంది.

ఆ సమయంలోనే శివనాడార్‌ ఫౌండేషన్‌ సుదీక్షకు సాయం అందించింది. ఈ సంస్థ గ్రామీణ భారతంలో ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేని తెలివైన విద్యార్థులకు సాయం చేస్తుంది. అలా ఆ సంస్థ సాయంతో విద్యాజ్ఞాన్‌ పాఠశాలలో చేరింది. ‘ఎవరేం అన్నా నేను బాధపడలేదు. అనుకున్న లక్ష్యం సాధించినప్పుడు వీళ్లు నన్నేం చేయాలేరని నిర్ణయించుకున్నా. ఎవరైతే తమకు తాము సాయం చేసుకుంటారో వారికి దేవుడు కూడా తప్పక సాయం చేస్తాడని నమ్మా. స్కూలు టీచర్లు నాకు అండగా నిలబడ్డారు. నేనూ చదువునే నమ్ముకున్నా…’ అంటుంది సుదీక్ష.


అలా ఓ వైపు చదువుకుంటూనే వేసవిలో నిర్వహించే డ్యూక్‌ టిప్‌ (ఇండియా), పెన్సిల్వేనియా స్కూల్‌ ఫర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (లెహెగ్‌, యూఎస్‌ఏ)ల్లో పాల్గొంది. స్కూల్లో చదువుతున్నప్పుడే అమ్మాయిలను స్కూల్‌కి పంపించమని ‘వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌’ పేరిట ఒక అవగాహనా కార్యక్రమాన్నీ నిర్వహించింది. ‘మా ప్రాంతంలో ఈవ్‌ టీజింగ్‌ ఎక్కువ. దాన్ని అరికట్టేందుకు కూడా పోరాడా. ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది….’ అని చెబుతుంది. అలాగే ఇంటరు పూర్తి చేసింది. ఇప్పుడు స్కాలర్‌షిప్‌ సాయంతో అమెరికాలో చదవడానికి సిద్ధమవుతోంది.

Like to read this article in english