జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు బీజేపీ నిన్న గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ర్టపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు.
మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నిన్న ఢిల్లీలో ఆకస్మికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు అధికార పగ్గాలను గవర్నర్ చేతికి అందించాలని నిర్ణయించామని చెప్పారు. అంతకుముందు బీజేపీ అధిష్ఠానం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో మం త్రులుగా ఉన్న తమ సభ్యులను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపింది.
జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో అక్కడ గవర్నర్ పాలన అనివార్యం కానుంది. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా హయాంలోనే మూడుసార్లు అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది.
ఈసారి కూడా విధిస్తే ఆయన హయాంలో నాలుగోసారి అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం.
రాష్ట్రపతి పాలన కాదు.. గవర్నర్ పాలన
సాధారణంగా రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ జమ్మూకశ్మీర్లో మాత్రం అలా కుదరదు. జమ్మూకశ్మీర్‌కే ప్రత్యేకమైన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సంక్షోభ సమయాల్లో విధించేది గవర్నర్ పాలన.
జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం రాష్ట్రంలో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. గవర్నర్ పాలన సమయంలో అసెంబ్లీని రద్దు చేయడం కానీ, సుప్త చేతనావస్థలో ఉంచడం కానీ చేస్తారు. ఆర్నెల్లలోపు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో మరో ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన పొడిగిస్తారు.
త్వరలో కొత్త గవర్నర్!
జమ్మూకశ్మీర్‌కు కేంద్రం త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన అనంతరం కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై.. రెండు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుత గవర్నర్ వోహ్రాకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్ర బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది.