విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్స్, టెక్ట్స్ బుక్స్‌

318

నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్స్‌, టెక్ట్స్ బుక్స్ ఇస్తామ‌ని కేంద్రం తెలిపింది.

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం నవోదయ విద్యాలయ సమితి 40వ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ , విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రేతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన‌ పలు అంశాలపై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. 6వ త‌ర‌గ‌తి నుంచి 12వ తరగతి వ‌ర‌కు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

9వ తరగతి, ఆ పై తరగతుల‌ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్స్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు CSR నిధులతో హాస్టళ్లు, స్కూల్ పనితీరును మెరుగుపరచనున్నారు.

ఈశాన్య రాష్ట్రాలు జమ్మూకాశ్మీర్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌పై ప్రత్యేక చర్చ జరిగింది. వచ్చే ఏడాది నుంచి న్యూ ట్రాన్స్‌ఫర్ పాలిసీని అమల్లోకి తేవాలని నవోదయ విద్యాలయ సమితి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.

ఇంజినీరింగ్ కేడర్‌కు సంబంధించి నియామక నిబంధనలను దిద్దుబాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్వ విద్యార్థులు నవోదయ స్కూళ్లను దత్తత తీసుకోవాలని నవోదయ విద్యాసమితి విజ్ఞప్తి చేసింది.

కరోనా తర్వాత స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా నాణ్య‌మైన డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.