భారత్‌కు స్పుత్నిక్‌ వీ టీకా?

355

క‌రోనా వైర‌స్ త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది. అనేక రూపాల్లోకి మారి క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీన్ని క‌ట్ట‌డి చేసేందుకు మ‌న దేశం కూడా వ్యాక్సిన్ త‌యారు చేసింది.

అయితే 130 కోట్ల ప్ర‌జ‌ల‌కు అది స‌రిపోదు. అందుకే విదేశాల నుంచి కూడా క‌రోనా వ్యాక్సిన్‌ను దిగుమ‌తి చేసుకుంటున్నాం.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా భార‌త్‌కు రాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాలా వ‌ద్దా అనే దానిపై భార‌త ప్ర‌భుత్వం నిపుణ‌ల క‌మిటీ అభిప్రాయాల‌ను కోరుతోంది.

స్పుత్నిక్ వి టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తిని కోరుతూ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ గ‌త వారంలో డీసీజీఐకు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఫేజ్‌-2 క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి అందించింది.

రష్యాకు చెందిన డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకాను భారతలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో రష్యన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

మధ్యంతర సమాచారం ప్రకారం ఈ టీకా 91.6 శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా ప్రభావశీలత కలిగిన మూడు టీకాల్లో స్పుత్నిక్‌ వి టీకా ఒకటి.

దీనికి ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో అనుమతులు వచ్చాయి. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఈ టీకా ఇచ్చారు. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండడంతో డీసీజీఐ అనుమతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.