కొద్దిరోజుల క్రితం కిడ్నాప్, అత్యాచారం డ్రామా ఆడిన బి-ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం చేసుకుంది. ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
రంగంలోకి దిగిన పోలీసులు యువతిని రక్షించి కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో అదంతా ఒట్టి డ్రామా అని తెలిసింది. వివరాల్లోకి వెళితే … ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఆ అమ్మాయి తన తల్లి దండ్రులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది.
వెంటనే యువతి తల్లి 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు.
ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలేజీ నుంచి షేర్ ఆటోలో ఇంటికి వస్తున్న తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం జరిపారని యువతి ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే యువతి చెప్పేదానికి, ఆటోడ్రైవర్ల మాటలకు ఎక్కడా మ్యాచ్ కాకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపారు.
సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించారు. ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేశారని చెప్పే సమయంలో యువతి…స్నేహితునితో కలిసి బైక్‌పై వెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డయింది.
ఆ దృశ్యాల ఆధారంగా యువతిని గట్టిగా ప్రశ్నించగా…ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో తల్లి తిడుతుందన్న భయంతో.. కిడ్నాప్ డ్రామా ఆడానని యువతి అంగీకరించింది.
లాక్‌డౌన్ సమయంలో చిల్లర విషయంలో ఆటో డ్రైవర్‌తో జరిగిన గొడవ కారణంగా అతని పేరును పోలీసులకు చెప్పినట్టు వెల్లడించింది. యువతి వాంగ్మూలం స్వీకరించిన తర్వాత పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి సీసీటీవీ ఫుటేజీని చూపిస్తూ కిడ్నాప్ డ్రామా సాగిన తీరును వివరించారు.
ఆటో డ్రైవర్లను అనుమానించినందుకు ఈ నెల 13వ తేదీన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆటో డ్రైవర్ల యూనియన్‌కు క్షమాపణలు చెప్పారు. తన కిడ్నాప్ డ్రామాగా తేలడంతో యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ డ్రామా సంచలనం సృష్టించడం, పరువు పోవడం, బంధువులను, స్నేహితులను కలిసే పరిస్థితి లేకపోవడం ఆ యువతిని తీవ్రంగా వేధించాయి.
తన మూలంగా కుటుంబం పరువు కూడా పోయిందని యువతి ఆవేదన చెందింది. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతిపై కేసు నమోదయింది.