ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన విశాఖపట్నలో మంగళవారం అర్ధ రాత్రి జరిగింది.
ఇంటి బయట అరుగుపై కూర్చున్న వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుపరాడ్లతో కొట్టి చంపారు. ఆపై కత్తులతో పొడిచారు. దీంతో ఆ రౌడీ షటర్ అక్కడిక్కడే మృతిచెందాడు.
వివరాల్లోకి వెళితే… మద్దెలపాలెం లోని కేఆర్ఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి మంగళవారం రాత్రి తన ఇంటి ముందు ఉన్నఅరుగుపై కూర్చొని ఉన్నాడు.
అదే సమయంలో బైక్‌పై ఇద్దరు, కారులో మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి బండరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తొలుగ ఇనుపరాడ్లతో దాడి చేసిన ఆ వ్యక్తులు తర్వాత కత్తులతో పొడిచారు.
దీంతో తీవ్ర రక్తస్రావమైన బండరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. వెంకట్‌రెడ్డి రౌడీ షటర్ అని తనికి నేర చరిత్ర ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. సుపారీ తీసుకుని నేరాలకు పాల్పడేవాడని తెలిపారు.
బండరెడ్డిపై రెండు హత్య కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. విభేదాల కారణంగా అతనితో కలిసి తిరిగే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆధిపత్యం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాధమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.