మరింత పెరుగనున్న స్మార్టుఫోన్ ధరలు

328
smartphone-prices-yet-increased

మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెరిగింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకే ఈ పెంపు అని బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అయితే 2017 డిసెంబరు 14 వరకు మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ 10 శాతం ఉండేది. డిసెంబరు 15న దీనిని 15 శాతానికి చేరుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చార్జర్లు, బ్యాటరీలపై కస్టమ్స్‌ డ్యూటీ 10 నుంచి 15 శాతానికి ఎగసింది.



తాజాగా బడ్జెట్‌ ప్రకటనతో కొత్త పన్ను వెంటనే అమలులోకి వచ్చింది. అన్ని కంపెనీలు ధరలను సవరించాల్సిందే. దిగుమతైన మొబైల్‌ ఫోన్ల విక్రయ ధర 5 శాతం వరకు అధికం కానుందని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. విదేశాల్లో తయారవుతున్న కొన్ని బ్రాండ్లపైనే కస్టమ్స్‌ డ్యూటీ పెంపు ప్రభావం ఉంటుందని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) ప్రెసిడెంట్‌ పంకజ్‌ మొహింద్రూ తెలిపారు.

కస్టమ్‌ డ్యూటీ పెంపు దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తుందని వన్‌ప్లస్‌ ఇండియా జీఎం వికాస్‌ అగర్వాల్‌ తెలిపారు. తమ బ్రాండ్‌కు చెందిన 85 శాతం యూనిట్లు దేశీయంగా ఉత్పత్తి అవుతున్నవేనని చెప్పారు. షావొమీ ఫోన్లలో 5 శాతం మాత్రమే దిగుమతి అవుతున్నాయి. తయారీకి గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ అవతరిస్తోందని మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకులు రాజేష్‌ అగర్వాల్‌ అన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వ్యాపారంతోపాటు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు.

దిగుమతి సుంకం పెంపు మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమిస్తుందని ప్యానాసోనిక్‌ ఇండియా సీఈవో మనీష్‌ శర్మ చెప్పారు. ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల రిపేరు మరింత ప్రియం అవుతుందని కూల్‌ప్యాడ్‌ ఇండియా సీఈవో సయ్యద్‌ తాజుద్దీన్‌ పేర్కొన్నారు. కస్టమర్లపై భారం తప్పదని వ్యాఖ్యానించారు. 2018లో అమ్ముడయ్యే ఫోన్లలో భారత్‌లో తయారైనవి 90% ఉంటాయని ఐసీఏ అంచనా.

ఐఫోన్‌ ఎస్‌ఈ మినహా ఆపిల్‌కు చెందిన అన్ని మోడళ్లూ విదేశాల్లో తయారై భారత్‌కు దిగుమతి అవుతున్నవే. సామ్‌సంగ్, మోటరోలా, లెనవూ, సోనీ, ఓపో, వివో, ఎల్‌జీ, ప్యానాసోనిక్, జియోనీ, వన్‌ప్లస్‌ తదితర బ్రాండ్లు చాలా మోడళ్లను భారత్‌లో అసెంబుల్‌ చేస్తున్నా కొంత మేర దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. కొన్ని చైనా బ్రాండ్లు దిగుమతులపైనే ఆధారపడ్డాయి.