జిల్లా కలెక్టర్ అంటే సకల సదుపాయాలుంటాయి. భద్రతా సిబ్బంది, గుమాస్తాలు, ఇతర సిబ్బంది ఉంటారు.
ఆ ఉన్నతాధికారి చుట్టూ మంది మార్బలం ఉంటారు. అయినప్పటికీ ఈమె మాత్రం తన పని తానే చేసుకుంటుంది.
ఆమె ఎవరో కాదు డైనమిక్ కలెక్టర్ రోహిణి సింధూరి. అదేనండి మొన్న తన కారు టైరు పంక్చర్ అయితే తానే మార్చుకుంది కాదా! ఆమే ఈ సింధూరి.
ఎంతో నిజాయితీగా కర్నాటక రాష్ట్రంలో కలెక్టర్‌గా పని చేస్తున్ మన తెలుగమ్మాయి సింధూరి తన హోదాను పక్కనబెట్టి తన పనులు తానే చేసుకుంటుంది.
ఎల్లప్పుడూ నిరాడంబరతను చాటుకుంటారు. అయితే రోహిణి సింధూరి డ్యూటీలో కూడా ఎంతో నిజాయితీగా ఉంటారు.
తెలుగు బిడ్డ: రుద్రాక్షపల్లిలో పుట్టిన దాసరి రోహిణి హైదరాబాదులో పెరిగారు.
ఇంజనీరింగ్ చదివిన ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2009లో సివిల్స్ సాధించి కర్నాటక క్యాడర్ నుండి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డిని కలెక్టర్ రోహిణి సింధూరి పెళ్లి చేసుకున్నారు.
అలా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆమె మైసూరు జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
డైనమిక్ కలెక్టర్
రోహిణి సింధూరికి కర్నాటకలో డైనమిక్ కలెక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది.
ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతటి వారినైనా అస్సలు లెక్కచేయరు.
నిజాయితీగా నిక్కచ్చిగా ముక్కుసూటితనంగా మాట్లాడతారనే పేరుంది.
ఎన్నికల కోడ్ సమయంలో: ఆమె హాసన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఓసారి ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. అధికార పార్టీ మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
దీనిపై కలెక్టర్ రోహిణి సీరియస్ అయ్యారు. అంతేకాదు యాక్షన్ కూడా తీసుకున్నారు.
అయితే దీన్ని అవమానంగా భావించిన తను ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఆమెను ట్రాన్స్‌ఫర్ చేయించారు.
కోర్టులో గెలిచి
తన ట్రాన్స్‌ఫర్‌ను సవాల్ చేస్తూ తను తిరిగి అదే జిల్లాకు కలెక్టర్‌గా కొనసాగారు.
అయితే ఆమెకు ఆ ధైర్యం అంత తేలిగ్గా వచ్చిందేమీ కాదు. తను సివిల్స్ పరీక్షకు ముందు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఇబ్బందులు పడుతూనే సివిల్స్ పరీక్ష రాశారు. అయినా మంచి ర్యాంక్ సాధించారు.
కర్నాటకలో పలు జిల్లాల్లో సమర్థవంతమైన కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పేదల పక్షపాతి
స్వచ్ఛమైన పాలన ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే అధికారిగా రోహిణి గుర్తింపు తెచ్చుకున్నారు.
మండ్య జిల్లాలో ఒక్క ఏడాదిలోనే లక్ష వరకు మరుగుదొడ్లు కట్టించి అందరికీ అవగాహన కల్పించడంలో కీలకపాత్ర వహించారు.
రైతులకు కరువు సహాయం వచ్చేలా చూడటంతో పాటు కల్పామ్రుత ప్రాజెక్టు ద్వారా కొబ్బరి నీళ్లను ఎలా మార్కెంటింగ్ చేయొచ్చో చేసి చూపించారు.
ఎవరి సాయం తీసుకోరు
ఇదిలా ఉండగా ఇటీవల రోహిణి సింధూరి తన కారు టైరు తానే స్వయంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫ్యామిలీతో కలిసి కారును డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్న సమయంలో టైరు పంక్చర్ అయింది.
ఆ సమయంలో తను ఎవరి సాయం కోరకుండా అందుబాటులో ఉన్న పనిముట్లతో చకచకా టైరును మార్చేశారు.
ఈ సంఘటనను చూసిన కొందరు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో బాగా వైరల్ మారిపోయింది.