విద్యాలయాలలోని సమస్యలకు పరిష్కారం చూపాలి!

255
problem in schools must be solved efficiently

భూప్రపంచంలో స్థిరస్థాయిగా మర్చిపోలేని విషయమేమిటంటే కరోనా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమాజంలో ఎంతో శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి జరిగిన, ఎన్నో ఆశ్చర్యకర ఆవిష్కరణలు, వింతలు, విపత్తులు, మర్చిపోలేనటువంటి సంఘటనలుజరిగిన, అన్నింటిని మైమరిపించేవిధంగా, శాశ్వతంగా తనను గుర్తుంచుకునేలా చేసిందేమిదన్నఉందంటే అది కరోనా అనిచెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.

భిన్నరంగాలలో చేసిన సంఘటనల గురించి వ్రాస్తే భూప్రపంచంలో సగానికిపైగా దీనిచరిత్ర అవుతుందనడంలో సైతం ఎలాంటి ఆశ్చర్యమక్కరలేదు.

ఒక విద్యారంగంలో చూసినట్లయితే 2019 డిసెంబర్ లో మొదలుకొంటే క్రమంగా వ్యాప్తిచెందుతూ, మనదేశానికి వచ్చేసరికి 1, 2 మాసాల సమయం పట్టినప్పటికీ విద్యారంగంలో తీరనిలోటు చేసిందనడంలో నిజంలేకపోలేదు. ఎట్టకేలకు పదవతరగతి వరకు పరీక్షలు పూర్తవకుండానే అందరికీ ఉత్తీర్ణులుచేసింది.

ఆతర్వాతి విద్యాసంవత్సరంతో సైతం పోటీపడుతూ, జరగకుండాచేసే ప్రయత్నంలో విజయంవైపు పయనించిన, ప్రభుత్వంలో ఉన్నమేధావులచే విద్యాసంవత్సరాని నాశనంచేయకుండా సెప్టెంబర్ 1 నుండి జనవరి 30 వరకు 115 రోజులపాటు పరోక్షపద్ధతిలో ఆన్లైన్ తరగతులద్వారా విద్యార్థులకు విద్యను అందించే ప్రయత్నంచేశారు.

కానీ అందులోసైతం పూర్తిగా విజయవంతం అయిందంటే తప్పేఅవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షబోధనలో సరైనన్యాయం జరగనప్పుడు ఆశించడం తప్పేఅవుతుంది. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలేక, ఆర్థికలేమితో తగిన సౌకర్యాలులేక, కొంతమంది విద్యార్థులు ఉంటే, ఆ వెసులుబాటున్న విద్యార్థులలో సైతం తూతూమంత్రంగా ఆన్లైన్ తరగతులకు హాజరైన విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన పరోక్ష ఆన్లైన్ తరగతులు 115 మరియు ప్రస్తుతం నాలుగునెలలో రెండవశనివారాలు పనిదినాలుగా భావించి, 89 రోజుల పనిదినాలుగా నిర్ణయించి, ఈ అకాడమీ విద్యాసంవత్సరాని పూర్తిచేయడానికి 204 పనిదినాలుగా భావించి, 30 శాతంవరకు సిలబస్ తగ్గించి, విద్యార్థులకు 30శాతం వరకు ప్రాజెక్ట్ వర్క్ అందించి, గైర్హాజరుతో సంబంధం లేకుండా, పరీక్షలకు అనుమతించి,విద్యాసంవత్సరానికి పూనుకొని, ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి 9 మరియు 10 తరగతులను ప్రారంభించింది.

10 లక్షల విద్యార్థులు 9, 10 తరగతులు, 9.5 లక్షల విద్యార్థులు ఇంటర్మీడియట్, 6 లక్షల విద్యార్థులు డిగ్రీ, 3.5 లక్షల విద్యార్థులు ఇంజనీరింగ్, మిగతా అన్నిరకాల కోర్సుల నుండి దాదాపు 35 లక్షలమంది విద్యార్థులకు ప్రత్యక్షవిద్య అందగా, ఫిబ్రవరి 15 నుండి 6,7,8 తరగతుల విద్యార్థులు సైతం హాజరవడానికి సంకేతాలిచ్చారు. దీనికితోడు ఈ సంవత్సరపు అకాడమిక్ క్యాలెండర్ మే 1 నుండి రివిజన్, ఫ్రీ ఫైనల్ పరీక్షలను రద్దు చేయడం, మే 17 నుండి 26 వరకు 10వ తరగతి వార్షికపరీక్షలు నిర్వహించడం, మే 27 నుండి జూన్ 13 వరకు వేసవిసెలవులు, జూన్ 14 నుండి కొత్త అకాడమీ సంవత్సరాన్ని ప్రారంభించడం, లాంటివిషయాలతో రూపొందించడం జరిగింది.

కరోనా నిబంధనలకనుగుణంగా పాఠశాలలను శానిటైజేషన్, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థులను 6 అడుగుల దూరంలో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం, ఒక తరగతిగదిలో బెంచ్ పై కేవలం ఒకరుచొప్పున గరిష్టంగా 20 మంది విద్యార్థులు ఉండేటట్లు చూడటం, ప్రభుత్వపాఠశాలలో మధ్యాహ్న భోజనసమయంలో ఒకేదగ్గర కూర్చోకుండా సామాజికదూరం పాటించడం, భోజనంలో సైతం తాజా ఆహారపదార్థాలు సమకూర్చడం, పాఠశాలల్లోనే ఐసోలేషన్ గదులు ఏర్పాటుచేసి వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహించడం, మాస్క్ లను తప్పనిసరిచేస్తూ, దానితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులతో అంగీకారపత్రం తీసుకోవడం, ఇంటర్ మీడియట్, డిగ్రీకళాశాలలో 300పైగా విద్యార్థులు ఉంటే, సంఖ్యనుబట్టి విడతలవారీగా తరగతులు నిర్వహించేలా కార్యాచరణను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ ప్రభుత్వపాఠశాలలో ఆయాలు, అటెండర్, మధ్యాహ్న భోజనంఏర్పాటు చేసేవారికొరత చాలా ఉన్నది. అందుకే గ్రామపంచాయతీ సిబ్బందితో ఈ పనులు చేయించడానికి పూనుకున్న, పనిభారం ఎక్కువై, తగిన వేతనాలు అందక, వారుసైతం అసంతృప్తితో కొనసాగడం చూస్తుంటే ఈ పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగానే మారిందనడంలో నిజం లేకపోలేదు.

ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకొచ్చేసరికి పరిస్థితులు తీవ్ర కఠినతరంగా కనిపిస్తున్నాయి. 89 రోజుల పనిదినాలకు పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రఒత్తిడి తెస్తున్నారు. ఫీజుల తగ్గుదలకు ససేమిరా ఒప్పుకోకుండా తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని విద్యాసంస్థలు మాత్రమే 10 నుండి 20 శాతం తగ్గుదలకు పూనుకుంటున్నారు. కానీ మిగతావారు ముక్కు పిండి వసూలుచేసే పనిలో నిమగ్నమయ్యారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

కరోనా సందర్భంగా ఆర్థికసమస్యలకు లోనై తమపిల్లలను చదివించుకోలేక నానా ఇబ్బందులు పడుతూ, కరోనా సందర్భంలో రాష్ట్రప్రభుత్వం 2020ఏప్రిల్ లో జారీచేసిన జీవోనెంబర్ 46 ప్రకారం నెలలవారీగా ట్యూషన్ ఫీజు వసూలుచేయాలని ప్రాధేయపడుతున్నారనడంలో ఎలాంటి అబద్ధం లేదు.
ఈ సమస్యలు ఇలాకొనసాగడం ఒక్కేత్తైతే ప్రభుత్వం విడుదలచేసిన నియమ నిబంధనలు కొనసాగుతాయా ? తూతూ మంత్రంగానే చేస్తూ, విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కొనితెస్తారనే మీమాంస అందరిలో కొనసాగుతుండడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

ఇదిలాఉంటే ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే సిబ్బందిని కరోనా సమయంలో చేసినపనికి జీతాలు ఇవ్వకుండా, ఆపదలో ఆదుకునే ప్రయత్నం చేయకుండా కఠినంగా వ్యవహరిస్తూ, కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సిబ్బందిని తొలగించడం, వారిచ్చే పత్రాలపై సంతకాలు చేయించుకోవడం అందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతం ప్రైవేటువిద్యాసంస్థల యాజమాన్యాలు సమావేశమై పీరియడ్ ప్రకారం వేతనాలుఇవ్వాలని, ఇంకా వారిఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేయాలని చూస్తున్నాయి. విద్యార్థులవద్ద పూర్తిఫీజులు వసూలుచేసే విద్యాసంస్థలు, అందులో పనిచేసే సిబ్బందికి పూర్తి అకాడమిక్ సంవత్సరం వేతనాలు చెల్లించడానికి పూనుకుంటాయా? అంటే ఏఒక్కరు ఒప్పుకోలేని పరిస్థితి.ఇదెక్కడి న్యాయం? ఈ విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకుని విద్యార్థులకు,ఇటు సిబ్బందికి మేలుచేసే విధంగా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఇంకాకొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కేవలం ధనార్జనకు అధిక ప్రాధాన్యతనిస్తూ, కష్టకాలంలో తనవద్దనున్న సిబ్బందిని ముందుగానే తొలగించి, నూతనంగా అతితక్కువ వేతనాలతో పనిచేసే సిబ్బందిని నియమించుకునే ప్రయత్నంలో మునిగిపోయాయి.

కేవలం వారియొక్క ఆర్థికలేమితో, వారి జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సరైనదో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. ఎలాంటి ఉద్యోగభద్రత లేకుండా, అతితక్కువ కనీస వేతనాలతో “ బతకలేని బడిపంతులుగా” పనిచేస్తూ, తమకుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతికిడుస్తున్న నవసమాజ నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైఉన్నది.

దేశభవిష్యత్తు కేవలం తరగతిగదిలో నిర్మితమవుతుంది.సమాజాన్ని ఉద్దరించడానికి కారణమయ్యే ఉపాధ్యాయుని జీవితం అంధకారం అవుతున్న విషయాన్ని కరోనాకాలంలో చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఆర్థికలేమి కారణంగా సంఘటితం కాలేకపోతున్నారు.వారి సహనాన్ని పరీక్షించకుండా ముందుగానే మేల్కోనవలసిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది.

ఎవరు అవునన్నా,కాదన్నా ఈసమాజంలో ఎన్నో ఉన్నతచదువులు చదివి, ప్రభుత్వఉద్యోగ నియామకాలు జరగకపోయిన, ఎవరిని నిందించకుండా ఏదో తోచినవిధంగా ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. ఇంకా వారిసహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వ జోక్యంచేసుకోని ప్రైవేటు సిబ్బందిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేనిచో ఏదోఒక సందర్భంలో దానికితగిన ప్రతిఫలం చవిచూడవలసి వస్తుందనడంలో ఎలాంటి అనుమానమక్కరలేదు.

కావున కేవలం ప్రభుత్వమే కల్పించుకుని ప్రభుత్వపాఠశాలల్లో అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తూ, ప్రైవేటు విద్యాసంస్థలలో కరోనా నిబంధనలు ఎప్పటికప్పుడు తనిఖీచేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు అండగాఉంటూ,ఇటు అందులో పనిచేసే సిబ్బందిపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించి ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.

– డా.పోలం సైదులు