తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ ఇంటి పార్టీ’ అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం దళితుడిని చేస్తానన్న కేసీఆర్, తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ స్థానంలో ఈటల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పటివరకూ ఆ హామీని నెరవేర్చాలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నప్పటికీ అందులో ఎంతమాత్రమూ స్పష్టతలేదన్నారు.