టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కీర్తి సురేష్ ప్రేమాయణం, పెళ్ళి ?

261
Keerthy Suresh to tie the knot with music composer Anirudh Ravichander?

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారనేది ఈ వార్తల సారాంశం.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కీర్తి గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తోందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారి సమక్షంలోనే అనిరుధ్, కీర్తి పెళ్ళికి సిద్ధమవుతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఈ వార్తపై అటు కీర్తి గాని, ఇటు అనిరుధ్‌గాని ఇప్పటివరకు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో పని చేశారు.

తెలుగులో పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ కలిసి నటించిన “అజ్ఞాతవాసి” చిత్రానికి కూడా అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

‘మహానటి’తో జాతీయ అవార్డు సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.

కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘గుడ్ లక్ సఖీ’, ‘రంగ్ దే’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తోంది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

మరోవైపు అనిరుధ్ దర్శకుడు శంకర్‌తో కలిసి రామ్ చరణ్ పాన్-ఇండియన్ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.