వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పారామెడికల్ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రభుత్వం వైద్యరంగంలో ప్రవేశపెడుతున్న విధానాల కారణంగా ప్రభుత్వ దవాఖానల పరిధిలో సాంకేతిక నిపుణుల అవసరం పెరుగుతున్నది. పారామెడికల్ డిప్లొమా పూర్తిచేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
రెండేండ్ల వ్యవధి డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు దవాఖానల్లో, ప్రయోగశాలల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 33,871 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా www.tspmb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పారామెడికల్ కోర్సులకు పెరుగుతున్న ప్రాధాన్యం, విద్యార్థుల్లో నెలకొన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
-సర్కారు చర్యలతో పెరిగిన ఉద్యోగావకాశాలు
-పారామెడికల్ సీట్ల పెంపునకు ప్రతిపాదనలు
-విద్యార్థుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి