ఇక ఈ విద్యాసంవత్సరం జీరో ఇయరేనా ?

214
is this year a zero academic year

కరోనా నేపథ్యంలో మార్చి16 నుండి రాష్ట్రంలోని అన్నిపాఠశాలలకు కేంద్రప్రభుత్వ సూచనలమేరకు సెలవులను ప్రకటించడం జరిగింది.2019 – 20 అకాడమిక్ సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా, వార్షికపరీక్షలు నిర్వహించకుండానే పదవతరగతి వరకు అన్నితరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయడం జరిగింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళకుండా దాదాపు తొమ్మిదిన్నరనెలలు కావస్తుంది.

2020 – 21 విద్యాసంవత్సరం జూన్2న తెలంగాణరాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణచేసి ప్రారంభించడం లేదా జూన్12 నుంచి ప్రభుత్వం అధికారికంగా తరగతులను నిర్వహించడం జరుగుతుంది.కానీ ఇప్పటివరకు పాఠశాలల తలుపులు తెరుచుకోకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే.ఒక విద్యాసంవత్సరం సంపూర్ణంగా నిర్వహించాలంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దాదాపు 220 రోజులు పనిదినాలు ఉండాలి.కానీ ఈవిద్యాసంవత్సరం సంగతేంటో అర్థంకానిపరిస్థితి.

రాష్ట్రంలో మొత్తం 40597 పాఠశాలలో 58లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.అందులో 22లక్షలమంది విద్యార్థులు 26వేల ప్రభుత్వపాఠశాలలో చదువుతుండగా,31లక్షలమంది విద్యార్థులు 10549 ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తుండగా,మిగిలిన విద్యార్థులు ప్రభుత్వగురుకులాలు,సెంట్రల్ గవర్నమెంటు పాఠశాలలో చదువును కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలనుసారం సెప్టెంబర్ 1నుండి డిజిటల్ పాఠాలను విద్యాశాఖ దూరదర్శన్ యాదగిరి,టీశాట్,నిపుణ చానల్స్ ద్వారా 3 నుండి 10 తరగతుల వరకు నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు 80 నుండి 95శాతం వరకు విద్యార్థులు హాజరవుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఎలాంటి అధికారిక గణాంకాలు లేవు.

ఎంతమంది విద్యార్థులు ఆసమయంలో టీవీ ముందు కూర్చున్నారు?ఎంతమంది విద్యార్థులకు అర్థమవుతుంది?ఏమైనా అనుమానాలువస్తే ఎలా నివృత్తి చేసుకుంటున్నారు?అనే ప్రశ్నలకు సమాధానాలేవి లేవు.9 మరియు 10 తరగతుల విద్యార్థులు డిజిటల్ తరగతులలో ఏమైనా డౌట్స్ వస్తే వారి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు వెళ్లి నివృత్తి చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం ఇచ్చిన సూచనలను రాష్ట్రప్రభుత్వం అమలుపరచడం లేదన్నవిషయం తెలిసిందే. అయినా డిజిటల్ తరగతులద్వారా కేవలం 2, 3 సబ్జెక్టులను ప్రతిరోజు 2, 3 పీరియడ్ లలో బోధించడం జరుగుతుంది.

10549 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో సగం పాఠశాలలోనే ఆన్లైన్ క్లాసెస్ జరగడం మూలంగా 15లక్షల మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నట్లు, వారిలో 9,10 తరగతుల విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా,ఎక్కువశాతం విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థంకావటంలేదని తెలుస్తుంది.

ఇదిలాఉంటే కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులనుండి ఫీజులు వసూలుచేస్తూ ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది.అంటే ఇక్కడ విద్యార్థులు వారియొక్క ఆర్థికస్తోమతను బట్టి కొంతమంది డబ్బులుకట్టి ఆన్లైన్ తరగతులకు హాజరుకాగా,మరికొంతమంది డబ్బులు కట్టలేక,స్మార్ట్ ఫోన్స్ మరియు టెలివిజన్ అందుబాటులో లేక తరగతులకు గైర్హాజరు కావడం,ఇంకొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు విన్న అర్థంకాక, వారి డౌట్స్ నివృత్తి చేసుకోలేక పోతున్నారన్నవిషయం అందరికీతెలిసిందే.

ఇలా పలురకాలుగా విద్యార్థులు ఉన్నప్పుడు,ఈ విద్యా సంవత్సరాన్ని ఎలాముగిస్తారో అర్థంకాని పరిస్థితి తలెత్తిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రభుత్వం ఒకవేళ ధైర్యంచేసి పాఠశాలలను తెరిచినా అతితక్కువ పనిదినాలలో, తగ్గించిన సిలబస్ పూర్తిచేయగలదా? ప్రస్తుతం కరోనా 2 వేవ్ వీస్తుందంటున్నారు. ఈసమయంలో ప్రభుత్వం తెరిచే సాహసం చేస్తుందా? కార్పొరేట్ , ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువ శాతంలో ఫీజులుకట్టి ఆన్లైన్ తరగతులు వింటున్నారు.

అలాగే ప్రభుత్వం సైతం టెలివిజన్ ద్వారా తరగతులు నిర్వహిస్తుండగా,వీటినే ప్రామాణికంగా తీసుకుని ఈవిద్యాసంవత్సరాన్ని ప్రమోట్ చేస్తే, తరగతులు వినని విద్యార్థుల సంగతేంటి? ఏం చదవకుండానే పైతరగతులకు వెళ్ళితే అసలుకే ఇబ్బందిరాదా?అలాఅని ఈవిద్యా సంవత్సరానికి జీరో ఇయర్ గా ప్రకటిస్తే, ఫీజులు కట్టిన విద్యార్థుల భవితవ్యం ఏమిటి? అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయనడంలో నిజం లేకపోలేదు.

తరగతిగదిలో విద్యార్థులు హాజరై, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా బోధించినప్పుడే అర్థంకాని పరిస్థితిలో ఉన్నప్పుడు,ఆన్లైన్ తరగతులు ద్వారా ఫలితం వస్తుందనుకోవడం తప్పే అవుతుంది.ఒకవేళ ఇప్పటికిప్పుడు సిలబస్ ను తగ్గించి, సెలవులను సైతం పనిదినాలుగా మార్చి తరగతులను నిర్వహించే అవకాశం ఏమన్నా ఉన్నదా? అనే విషయాలపై ఇప్పటికైనా ప్రభుత్వం  దృష్టికేంద్రీకరించి,పలువురు నిపుణులచే చర్చించి, అందరికీ ఆమోదంయోగ్యమైన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీలైనంత త్వరగా ఈసమస్యకు పరిష్కారమార్గం దొరకాలని ఆశిద్దాం.

-డా.పోలం సైదులు