రెస్టారెంట్స్‌లో ఆఫర్స్‌…గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్‌ ఫీచర్‌

256
google map new feature

మీరు తరచూ గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ రూట్ మ్యాప్స్ సేవలు అందించిన గూగుల్ మ్యాప్స్… ఇప్పుడు రెస్టారెంట్లల్లో ఆఫర్లు కూడా అందించబోతోంది. భారతీయ యూజర్స్‌ కోసం గూగుల్‌ మ్యాప్స్‌ తాజాగా మరో మూడు ఫీచర్స్‌ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్‌ ఫీచర్‌ వీటిలో ఉంది. గూగుల్ మ్యాప్స్ అందించే డైనింగ్ ఆఫర్స్ మీ అభిరుచులకు తగ్గట్టుగానే ఉంటాయి. మీ టేస్ట్‌కు తగ్గ రెస్టారెంట్లను సూచించే గూగుల్ మ్యాప్స్… ఆ రెస్టారెంట్లల్లో ఎంత వరకు డిస్కౌంట్ పొందొచ్చో వివరిస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.

ఈజీడైనర్‌ సంస్థతో కలిసి ‘ఆఫర్‌’ ఫీచర్‌ అందిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్‌ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌లో ఆఫర్స్‌ షార్ట్‌కట్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని కింద గురువారం మొదలు 15 రోజుల దాకా 1,500 పైచిలుకు రెస్టారెంట్లలో ఈజీడైనర్‌ ప్రత్యేక ప్రైమ్‌ ఆఫర్స్‌ను, కనీసం 25 శాతం డిస్కౌంట్‌ను కచ్చితంగా పొందవచ్చని గూగుల్‌ వివరించింది. ఇక దేశీ యూజర్స్‌ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌ను తీర్చిదిద్దామని, ఇందులో కొత్తగా రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, ఏటీఎంలు మొదలైన ఏడు విభాగాల షార్ట్‌కట్స్‌ చేర్చామని పేర్కొంది. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ’ఫర్‌ యూ’ ట్యాబ్‌ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అందించే సిఫార్సులను పొందవచ్చని గూగుల్‌ పేర్కొంది.