ఇలా చేస్తే గుండె జ‌బ్బులు రావు

568
health-tips-to-reduce-heart-attacks

నేటి త‌రుణంలో గుండె జబ్బుల కార‌ణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. అధిక బ‌రువు ఉండ‌డం, మ‌ధుమేహం, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా గుండె జ‌బ్బులు సంభ‌విస్తున్నాయి. అయితే కింద సూచించిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే త‌ద్వారా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!




 

1. మీ గుండె ఆరోగ్యవంతంగా ఉండాలంటే శరీరం నుంచి రోజుకు 500-950 క్యాలరీలు ఖర్చు కావాలి. గుండె సంబంధిత వ్యాయామాలు చేయడం వల్ల శ్వాస రేటు పెరుగుతుంది. అలాగే శరీర రక్త పీడనం కూడా సాధారణ స్థితిలో ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల చెమట అధికంగా బయటకు వెళ్లిపోతుంది. ఇది గుండెకు చాలా మంచి చేస్తుంది.

2. తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అందులో చక్కెర, ట్రాన్స్‌ ఫాట్‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్‌, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినటం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

3. మానవుడికి సుమారు 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. ఇలాంటి వారి గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ముఖ్య కారణం ఒత్తిడి. టెన్షన్‌ ఎక్కువైతే రక్త పీడనం అధికమవుతుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవాలి. టెన్షన్‌ పెట్టే విషయాలను ఎక్కువ సేపు డిస్కస్‌ చేయకూడదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.

4. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి మరో కారణం బరువు. వయసుకు తగ్గ బరువు లేకపోవడంతో శరీరంలో కొవ్వు , రక్త పీడనం, ఇన్సులిన్‌ స్థాయిలు పెరిగిపోయి గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రేరేపిస్తుంటాయి. అలాగే శరీరంలో కొవ్వు స్థాయిలు అధికం అవటం వల్ల రక్త పీడనం పెరుగుతుంది. మధుమేహం, గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి వయసుకు తగ్గట్టుగా శరరీ బరువును మెయింటెయిన్‌ చేయడం మంచిది. ఇందుకు వ్యాయామాలు చేయాలి.

5. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల రక్తపీడనం, గుండె ప్రెజర్‌ పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంతగా మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. గుండె సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు చాలా ముఖ్యం. విటమిన్ బి6, బి12 వంటివి గుండెకు చాలా అవసరం. ధమనుల్లో రక్తం గడ్డకట్టడాన్ని ఇవి నివారిస్తాయి.


6. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉండటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండటమే మేలు.

పైన చెప్పిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.