దేశంలో చూస్తుండగానే రెండుదశాబ్దాల కాలంలో తినే తిండిలో, చేసే పనులలో, మానవుల ఆలోచన విధానంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆధునికత, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ, నూతన ఆవిష్కరణలతో సగటు వ్యక్తిని ఆశ్చర్యాలకు గురిచేస్తూ, కాలంతోపాటు మానవజీవితాలను పరుగుపెట్టిస్తూ అర్దాంత జీవితానికే ముగింపు పలుకుతున్నాయి.
కేవలం ఆరోగ్యం, ఆహార పదార్థాల గురించి మాత్రమే ప్రాముఖ్యంగా తీసుకొని రెండుదశాబ్దాల గతం మరియు ప్రస్తుత జీవనప్రమాణాలను విశ్లేషిస్తే ఎలాంటి అభివృద్ధలోకి పయనిస్తున్నాము . . . వాటిమధ్యగల వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం.
ప్రస్తుతం సమాజంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధిసాధించి ,చిన్నచిన్న నగరాలలో సైతం జనాలతో కిక్కిరిసిపోయే ప్రైవేటు , కార్పోరేటు, మల్టీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దర్శనమిస్తూ, తమ శాఖలను పుట్టగొడుగులా విస్తరింపజేసుకుంటున్నాయి. తల్లిగర్భంలో పిండం మొదలైనప్పటి నుండి మొదలుకొంటే వృద్యాపంలో చనిపోయేంత వరకు దావఖానాల సహాకారం, మందులులేనిది ఉండలేని పరిస్థితులలో ఉన్నామన్నవిషయం అందరికితెలిసిందే. అంతెందుకు ఏకుటుంబాన్నీ తీసుకున్నా ఆకుటుంబ సభ్యులువాడే మందులను చూస్తుంటే.. ఇంట్లోనే ఒక చిన్న మెడికల్ షాపు ఉన్నట్లు అన్పిస్తుందనడంలో నిజంలేకపోలేదు. మానవులలో రోగనిరోధకశక్తి తగ్గి, విభిన్న రోగాలబారినపడటం సర్వసాధారణంగా గమనించవచ్చు. వీటికిగల కారణాలను పరిశీలిస్తే కాలుష్యం, మరీముఖ్యంగా తీసుకునే ఆహారపదార్థాలేనన్నది ముమ్మాటికీ వాస్తవమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం రుచులపేరిట శరీరానికి అసలైన లాభంచేకూర్చని, వీలైతే అనారోగ్య పరిస్థితులకు దారితీసేటటువంటి బేకరీ ఫుడ్స్ …కర్రీ పఫ్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, దిల్ కుష్, దిల్ ఫస్, బ్రెడ్, జామ్, పిజ్జా, బర్గర్ ఇలా ఎన్నోరకాల ఆహారపదార్థాలు ఇంకా, పాస్ట్ పుడ్ సెంటర్స్ లలో న్యూడిల్స్, ఎగ్, చికెన్, ప్రైడ్ రైస్ లు ఇంకా, గప్ చుప్, కట్లేస్ రకరకాల పేర్లుతెలియని పదార్థాలను తీసుకోని అనారోగ్యానికి గురవుతున్నారనడంలో ఎలాంటి అవాస్తవంలేదు.
అందుకే దావఖానాలలో ఆ రద్దీని చూస్తూ, “గాలిలో దీపం లాంటి” జీవితాలను కొనసాగించే స్థితికి చేరుకున్నారు. మహా అంటే ఎన్నో ఆరోగ్యసూత్రాలనుపాటిస్తూ, ధనవంతులయితే ఆరుపదుల వయస్సు దాటితేచాలు అదేమహాగగనమవుతుంది. గతంలో ఎలాంటి వైద్యసదుపాయాల అవసరంలేకుండా వందకుపైగా ఏండ్లు జీవించారంటే ఉన్నకారణాలలో ముఖ్యమైనది తీసుకునే ఆహారమని చెప్పకతప్పదు.
మానవశరీరానికి ఇనుప, ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు, పోషకపదార్థాలు, కాల్షియం, ల్యూటిన్, ఫోలిక్ ఆమ్లం, పీచు పదార్థాలు, బీజా కెరోటిన్, బి కాంప్లెక్స్ పదార్థాలు చాలాఅవసరం. ఇలాంటివెన్నో ప్రకృతి ప్రసాదించే ఆకుకూరలలోనే లభిస్తాయి.
గతంలో మానవులు తమపొలాలలో, గట్లమీద లభించేటటువంటి పాలకూర, తోటకూర, పొన్నగంటికూర, చేమకూర, మెంతికూర, చింతచిగురు, ముల్లంగిఆకు, మునగాకులు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చెన్నంగి, చిత్రమాల, గునుగు, ఎర్రగునుగు, ఇసుకదొగ్గలి, జొన్నచెంచలి, పప్పుకూర, పెద్దకాశి, పిట్టకూర, తెల్లగర్జి కూర, తగరంచ, తుమ్మికూర, ముల్లుతోటకూర, గొరిమేడ, అడవిమెంతల కూర, అడవి సాయకూర, ఎర్ర, నల్లకాశీ పండ్లకూర, చిలుకకూర, పుల్లకూర, నల్లపప్పుకూర, నాగలిచేవి కూర, అంగిచింగి, తగిలంచేకూర, బంకంటి, పల్లేరు కూర, ముద్దకూర, ఎణ్ణాద్రి కూర, తురాయి, గోరుముడి, అడవి పుల్లకూర, బుడ్డకాశ, నల్లనేలుసిరి, అత్తిపత్తి కూర వీటితోపాటు…
సహజంగాపండే అడవికాకర (ఆకాకల్), దొండ, అడవిదొండ, కాశీపండ్లు, తెల్ల దార్జరి కాయలు, మేడికాయలు, పుల్ చరిపండ్లు, కాకిపండ్లు, ఈతపండ్లు, మొర్రిపండ్లు, బొంతపండ్లు ఇలాంటి పోషకవిలువలు, ఔషధ గుణాలు కలిగిన యాభైకిపైగా ఆకుకూరలు, పండ్లలో లభించడం, వాటిని జొన్నలు, సజ్జలు, రాగులపిండితో తయారుచేసుకున్న రొట్టెలలో పెట్టుకుని తినడంమూలంగా శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుదల జరిగి, ఎలాంటి అనారోగ్యాలబారిన పడకుండా, దృడంగా ఉండటానికి దోహదబడేవి.
ప్రస్తుతం విటమిన్ A కారణంగా దేశంలో ప్రతి ఏటా 5 ఏళ్లలోపు పిల్లలు 30వేలమంది కంటిచూపును కోల్పోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.అలాగే ఇనుములోపం కారణంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు అనీమియా వ్యాధి సోకుతుంది. వీటన్నింటికి కావలసిన నివారణ కేవలం ఆకుకూరలలోనే లభిస్తాయన్న సంగతి కొద్దిమందికే తెలుసు కాబోలు. అందుకే ఇలాంటి ఆకుకూరలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి.
ప్రస్తుతంవాడే ఆకుకూరలలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే .. వాడి, కొంతవరకు రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1. కరివేపాకు:
సాధారణంగా వంటకాలలో వినియోగించే కరివేపాకు వల్ల మానవశరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.ముఖ్యంగా క్యాన్సర్ నివారకంగా ఉపయోగపడుతుంది. మలబద్దక సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.శరీరంలో ప్రముఖ అవయవం అయిన కాలేయాన్ని ఉత్తేజపర్చుటలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.దీనిని పొడిగా చేసుకొని తినేఆహారంలో తీసుకుంటే రక్తపోటును అదుపుచేసుకోవచ్చు.
2.కొత్తిమీర:
సర్వసాధారణంగా ప్రతివంటకంలో వినియోగించే కొత్తిమీర.. మనిషి ఆహారరుచిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిచేసే కూరగాయ వంటకాలు నోటికి రుచిని కలిగిస్తాయి. అదేవిధంగా విరేచనాలతో బాధపడే వారు దీనిని తింటే ఉపయోగంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది ప్రముఖపాత్ర పోషిస్తోంది.
3.పొన్నగంటి కూర:
ఇది గ్రామీణప్రాంతాల చేలలో విరివిగా లభిస్తుంది. అన్ని ఆకుకూరల్లోకెల్లా ఇందులో అధిక విటమిన్లు ఉంటాయి.ముఖ్యంగా చూపును మెరుగుపరుస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. కడుపులో చేరిన తల వెంట్రుకలను సైతం నశింపజేస్తుంది. దీన్ని పొడి… కూర, పప్పు, వేపుడు మాదిరిగా వివిధ రకాలుగావండి ఆరగించవచ్చు.
4.ముల్లంగి ఆకు:
ఇది ఆకుకూరకన్నా దుంపగా అధికప్రాధాన్యం పొందింది. దీనిఆకులు కూడా కూరగా వండుకొని తినవచ్చనేది మనప్రాంతంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. దీనిని సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. తినడం మూలంగా శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరిగి రోగాలబారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది.శరీరగాయాలకు మందుగాకూడా పనిచేస్తుంది.
5.పాలకూర, తోటకూర:
పాలకూర, తోటకూర, పుంటికూర వంటి ఆకుకూరల్లో పుష్కలంగా అన్నిరకాల బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మవ్యాధుల నిరోధానికి, రక్తహీనత కాకుండా తోడ్పడుతాయి. అదేవిధంగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
6. చింత చిగురు:
దీనిని ఇష్టపడనివారంటూ ఉండరు. దీనితో చేసినమాంసం,చికెన్ వంటకాలు భలేరుచిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తశుద్ధితోపాటు కాలేయానికి పుష్టినిస్తుంది.అంతేకాకుండా పైత్యం, వికారాలు, మచ్చలను కూడా నివారిస్తుంది. ఉదయం అరకప్పు చింతచిగురు రసంతాగితే పచ్చకామెర్లు మాయమవుతాయి. అలాగే లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది.
7.చేమకూర:
ఇది శరీరంలోని ఎటువంటి రాయినైనా కరిగించే గుణం కలిగిఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్నవారు చేమకూర లేదా చామగడ్డతో తయారుచేసిన వంటకాలను అధిక మొత్తంలో తీసుకుంటే మంచిది. మూలవ్యాధికి ఈకూర చాలామంచి విరుగుడు, తరుచూ వాడితే వ్యాధిని నివారించవచ్చు.
8.పుదీనా:
ఇది సుగంధభరితమైనది.దీనిని భుజించడంవల్ల మెదడుకు చురుకుదనంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.దీని ఆకులను స్నానపునీటిలో కలిపి స్నానంచేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పరగడుపున ఈఆకును ఆరగిస్తే గ్యాస్ సమస్యను నివారిస్తుంది.దీని రసంతో గొంతునొప్పి, తలనొప్పి తగ్గుతుంది.
9.మెంతి కూర:
ఇది రక్తపోటుకు దివ్యౌషధం. రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. ముల్లంగి మరియు మెంతికూర రెండు రంగరించి సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లుసైతం కరిగిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఆకుకూరలో శరీరానికుపయోగపడే ఔషధగుణాలుంటాయి. ఇక్కడ విశేషమేమిటంటే పట్టణ, నగర ప్రజలకు ఇన్నిరకాల ఆకుకూరలు తెలియడంలేదంటే కారణాలు ఉండవచ్చు. కానీ పల్లేప్రజలు సైతం క్రమంగా వాడకం తగ్గిస్తున్నారనడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేయకమానని పరిస్థితి. పరిణామక్రమంలో భాగంగా తినే ఆహారపదార్థాలలో సైతం ఎంతోమార్పువచ్చి, ఎలాంటి పురోగతి సాధిస్తున్నామో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం పల్లెలలో వ్యవసాయదారులు కూడా ఎంతోవిలువైన పోషకాలున్నా ఆకుకూరలను పొలంగెట్లపై నుండి కలుపుమొక్కలుగా తీసేస్తున్నారు తప్పా ! దానిని ఒక ఆహారపదార్థంగా ఉపయోగించుకోవచ్చని తెల్వడంలేదు. కావున ఇంట్లోవుండే పెద్దవారిని, వృద్ధులను అడిగి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రస్తుతం ఎరువులు, క్రిమి రసాయనిక పదార్థాలు వాడకుండా పంటలు పండించలేని పరిస్థితి. ఇలా ఆహారపంటలు దిగుబడికై వారు అనేకమందులువాడటం, వాటిని ఆహారంగా తీసుకోవడం మూలంగా ప్రజలు అనారోగ్యాలబారిన పడటానికి ఒకకారణమవుతుంది. ఇప్పుడిప్పుడే సమాజంలో ప్రకృతి శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, వైద్యులు సైతం ప్రస్తుతం సంభవిస్తున్న వివిధరోగాలకు, పాతతరం ఆహారాన్ని సూచిస్తూ, చిరుధాన్యాలను, ఆకుకూరలను సూచించడం మొదలుపెట్టారు. అంటే ఎంత అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ తిరిగి మొదటికి చేరుకుంటున్నామంటే వాటియొక్క విలువ తెలియకనే తెలుస్తుంది. కావున ప్రతిఒక్కరు ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాల్సిన అవసరమున్నది. కానీ వాటిని పలుమార్లు కడిగివాడుకోవాలి. లేకపోతే “కొండనాలుకకు మందువేస్తే ఉన్ననాలుక ఊడినట్లుగా” ప్రస్తుతం రసాయనాలతో పంటలు పండించే స్థితిలో ఉన్నాము.కావున తగినజాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
తీసుకునే ఆహారపదార్థాల విషయంలో జాగ్రత్త వహిస్తూ,శరీరానికి మేలుచేసేటటువంటి ఆకుకూరలను ఎక్కువ మోతాదులో తీసుకుంటూ, ఎలాంటి అనారోగ్యాల బారినపడకుండా, జీవితకాలాన్ని సైతం పెంచుకోవడానికి కృషిచేయాలి. అలాగే ప్రకృతి శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు సమాజంలో ప్రజలందరినీ చైతన్యపరుస్తూ, ప్రత్యేకంగా ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలో వివరిస్తూ,ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణానికి కృషిచేయాలని ఆశిద్దాం.