పోలీసులు వృత్తి నైపుణ్యాలు మరింత పెంచుకోవాలి

234
Police need to develop professional skills
  • ప్రజలతో మమేకం అవుతూ క్రమశిక్షణతో ముందుకు సాగాలి
  • సిబ్బంది సమస్యలు, సంక్షేమం విషయంలో మరింత ప్రాధాన్యత
  • వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మోబిలైజేషన్

నల్లగొండ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచుతూ క్రమశిక్షణతో పని చేయాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మోబిలైజేషన్ సందర్భంగా ఏ.ఆర్. సిబ్బందితో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థితుల క్రమంలో ఏ.ఆర్. సిబ్బంది సైతం శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు.

శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో కోపం వచ్చినప్పటికి ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా విచక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎట్టి పరిస్థితులలోనూ పోలీస్ శాఖ ప్రతిష్ట, ప్రజలలో పోలీసుల పట్ల ఉన్న గౌరవం దిగజారకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపైనే ఉన్నదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ శాఖలో ఆయుధాలు, లాఠీల వినియోగం చాలా వరకు తగ్గిందని, అయితే వాటిని ఎలా వినియోగించాలనే విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు. వీటన్నింటి కోసం ఏర్పాటు చేసే మోబిలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మోబిలైజేషన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రధానంగా లాఠీ డ్రిల్, పరేడ్, ఫైరింగ్ తో పాటు అన్ని రకాల అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఏ.ఆర్. సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందని చెప్పారు.

Armed reserved police

సంక్షేమం, సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం, సంక్షేమం, బదిలీలకు సంబందించిన అంశాలతో పాటు పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సంతోషంగా విధి నిర్వహణ చేసే వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా అదనపు ఎస్పీ, తన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. అదే సమయంలో సిబ్బంది మొత్తం ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 40 సంవత్సరాల వయసు దాటిన వారు నిత్యం నడక, యోగా, వ్యాయామం చేస్తూ తమతో పాటు తమ కుటుంబాల ఆరోగ్య విషయంలోనూ శ్రద్ద వహించాలన్నారు.

దర్బార్ లో అదనపు ఎస్పీలు శ్రీమతి నర్మద, సతీష్ చోడగిరి, డిఎస్పీ రమణా రెడ్డి, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్ రావు, సబితా రాణి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, కృష్ణారావు, నర్సింహా, ఆర్.ఎస్.లు కళ్యాణ్ రాజ్, రాహూల్, లియాఖత్, తదితరులు పాల్గొన్నారు.