బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ ప్రస్తావన రాలేదు: యనమల

185
Tdp Yanamala CM Jagan Union Budget

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్-2021పై  టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ ప్రస్తావన రాలేదని ఆయన అన్నారు. బడ్జెట్ తో ఏపీకి ఒరిగిందేమీ లేదని యనమల వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించలేదని  విమర్శించారు.

రాష్ట్రాల అభివృద్దికి దోహదపడే అంశాలు బడ్జెట్ లో లేవని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేలా, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్ లేదని అన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అంశాలు బడ్జెట్ లో లేవని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు.

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని ఆయన అన్నారు.

వైసీపీ ఎంపీలు సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. జగన్ వైఖరి వల్లే ఏపీకి సరైన ప్రాధాన్యత దక్కలేదని అన్నారు.

ప్రత్యేక హోదాను జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడటానికే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని యనమల దుయ్యబట్టారు.