బీఎస్‌–6‘స్ట్రీట్‌ 750’బైక్‌ నూతన వెర్షన్

329

అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌.. తాజాగా తన ‘స్ట్రీట్‌ 750’ బైక్‌లో నూతన వెర్షన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన మోడల్‌ను మంగళవారం విడుదలచేసింది. దీని ధర రూ.5.47 లక్షలు. యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), 750 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చిన ఇదే మోడల్‌లో 300 యూనిట్ల లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌లో హార్లీ 10 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తమ జర్నీని ప్రతిబింబించే విధంగా లిమిటెడ్‌ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ సజీవ్‌ రాజశేఖరన్‌ పేర్కొన్నారు.

ప్రీమియం విభాగంలో తొలి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్

భారత్‌లో తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్‌ బైక్‌ను హార్లీ డేవిడ్‌సన్‌ ఆవిష్కరించింది. ‘లైవ్‌వైర్‌’ మోడల్‌లో ఈ వాహనాన్ని పరిచయంచేసింది. ఇక గడిచిన పదేళ్ల కాలంలో కంపెనీ 24,000 యూనిట్లను ఇక్కడి మార్కెట్లో విక్రయించింది. మొత్తం 17 మోడళ్లను ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటిలో 11 మోడళ్లను హర్యానాలోని బావాల్‌ ప్లాంట్‌లో అసెంబుల్‌ చేస్తోంది.