నమ్మకంగా కాపాలా కాసే ఏకైక జంతువు శునకం. అందుకే చాలా మంది తమ ఇళ్ల గేటుకు కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు పెడతారు.
ఎందుకంటే తెలీయకుండా లోపలికి వస్తే పిక్కలు పీకేస్తాయి. అయితే ఇటువంటి జంతువులో మరో లక్షణం కూడా ఉందని ఒక అధ్యయనంలో తేలిందంట.
అదేంటంటే.. మనిషి ఎలాంటి వాడో అంటే మంచివాడా చెడ్డవాడా అని పసిగట్టేస్తాయంట.
తాజా అధ్యయనం ప్రకారం ఇవి మనుషుల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయగలవని తేలింది.
అంటే మనుషుల ప్రవర్తనను అంచనా వేయడంలో ఇవి మంచి న్యాయనిర్ణేతలని ఈ పరిశోధన చెబుతోంది.
జపాన్‌లోని క్యోటో వర్సీటికి చెందిన అకికో టాకోవాకా నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ప్రకారం కుక్కలు మనుషులను బాగా విశ్వసిస్తాయి.
అవి నమ్మదగినవి కూడా. అయితే ఎవర్నీ నమ్మాలో వాటికి బాగా తెలుసని కనుగొన్నారు.
కొన్ని కంటైనర్లలో ఆహారాన్ని పెట్టి మరికొన్ని కంటైనర్లను ఖాళీగా ఉంచారు. యజమానులు తమ కుక్కలను ఆహారం లేని పాత్రల వైపునకు పరుగెత్తాల్సిందిగా ఆదేశించారు.
వాళ్లు చెప్పినట్లే అవి చేశాయి. దీంతో శునకాలు మోసపోయాయి. రెండోసారి కూడా వారు అబద్దం చెప్పారు.
ఈసారి కూడా మోసపోయిన కుక్కలు మూడోసారి మాత్రం యజమానుల ఆదేశాలను నమ్మలేదు.
ఈ పరిశోధన ఆధారంగా ఎవరు నమ్మదగినవారో, ఎవరు కాదో శునకాలకు తెలుసని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ అధ్యయనం గురించి స్పందించిన అకికో.. కుక్కలు అనుకున్న దానికంటే ఎక్కువ మేధస్సును కలిగి ఉంటాయన్నారు.
శునకాలు సోషల్ ఇంటిలెక్చువల్ జీవులని, సూదీర్ఘ కాలంగా మానవులతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పారు. జంతు ప్రపంచంలో మనషులకు అత్యంత ఆప్తమిత్రులు శునకాలే.
మనకు అత్యంత పురాతన స్నేహితులు కూడా ఇవే. కుక్కలను మనిషి పెంచడమనేది చాలా కాలం కిందటే ప్రారంభమైంది. అంటే 11 వేల సంవత్సరాల నుంచి వీటితో అనుబంధముంది.
మనిషి ఇతర జంతువులను పెంచుకోక ముందు నుంచే కుక్కలను పెంచుకున్నట్లు తెలుస్తోంది. మనిషి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవి ఉన్నాయి.
మనిషి జంతువులను చంపి వేటాడి తినే ఆదిమ యుగం నుంచి ఓ మాంసాహార జంతువును పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నాడు.