దూడ‌కు పాలిస్తున్న శున‌కం

213

త‌ల్లి ఎవ‌రికైనా త‌ల్లే అంటారు. అంతేకాదు ఓ బిడ్డ ఆక‌లి త‌ల్లికి మాత్ర‌మే తెలుస్తుందంటారు. అది వంద శాతం నిజ‌మ‌ని ఈ దృశ్యం నిరూపిస్తోంది.

పిల్ల‌లున్న ఓ కుక్క ఓ లేగ దూడ‌కు పాలిచ్చి తాను ఓ మంచి త‌ల్లిన‌ని నిరూపించుకుంది. ఈ వింత ఘ‌ట‌న అదిలాబాద్ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం త‌ల్లిని కోల్పోయిన లేగ దూడ‌ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌ల కేంద్రంలోని జై శ్రీ‌రాం గోశాల‌లో వ‌దిలిపెట్టారు.

ఇత‌ర ఆవుల పాలు తాగి పెరుగుతుంద‌ని అనుకున్నారు. కానీ ఆ దూడ ఏ ఆవు ద‌గ్గ‌రా పాలు తాగ‌డం లేదు. డ‌బ్బాపాలు కూడా ముట్టుకోవ‌డం లేదు.

పాలు తాగ‌క‌పోయినా ఆ దూర నీర‌సించ‌డం లేదు. పైగా హుషారుగా తిరుగుతోంది. ఎందుకంటే అదే గోశాల‌లో ఉన్న ఓ కుక్క రోజూ ఈ దూడ‌కు పాలిస్తోంది.

అంతేకాదు కొన్ని రోజుల నుంచి ఆ దూడ కుక్క‌ల‌తో క‌లిసి తిర‌గ‌డం, వాటితోనే క‌లిసి ప‌డుకోవ‌డం చేస్తోంది. ఆ దూడ‌కు త‌ల్లి లేద‌న్న విష‌యాన్ని ఆ కుక్క ఎలా ప‌సిగ‌ట్టిందో కాని ఆ కుక్క త‌న జాతి వైరాన్ని మ‌ర‌చి ఆ దూడ‌ను అక్కున చేర్చుకుని పాల‌తో క‌డుపు నింపుతూ స‌ఖ్య‌త‌గా ఉంటోంది.

విచ‌క్ష‌ణ జ్ఞానం ఉన్న మ‌నిషి నీది ఈ జాతి.. నాది ఈ జాతి అంటూ బంధాల‌ను తెంపుకుంటున్న ఈ రోజులో జాతి వైరాన్ని మ‌ర‌చి దూడ ఆక‌లి తీరుస్తున్న కుక్క‌ను చూసి మ‌నం నేర్చుకోవాల్సింది లేదంటారా?

ఆ త‌ల్లి కుక్క మ‌నసుకు ఆ గ్రామ ప్ర‌జ‌లంద‌రూ ఫిదా అయ్యారు. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది.

కుక్క పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి కుక్క అర్ధాంత‌రంగా చ‌నిపోయింది. దీంతో ఆ పిల్ల‌ల‌న్నీ ఆవు పొదుగు చెంత‌కు చేరాయి.

త‌మ జాతి ప్రాణులు కాక‌పోయిన‌ప్ప‌టికీ ఆ ఆవు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఆ కుక్క పిల్ల‌ల‌కు త‌న పాలిచ్చి పెంచి పోషించింది.

జంతువులు జాతి వైరాన్ని మ‌రిచి ఇలా ఇన్యోన్యంగా మెలుగుతుంటే మ‌నుషులు మాత్రం కులాలు, మ‌తాలు, వ‌ర్గాల పేరుతో కొట్టుకు చ‌స్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను చూసైనా మ‌నిషిలో మార్పు రావాల‌ని కోరుకుందాం.