మ‌ళ్లీ కరోనా కలకలం

299
corona cases in Telangana

పెద్ద‌లు ఒక మాట చెప్పేవారు. పులి నాలుగ‌డుగులు వెన‌క్కి వేసిందంటే భ‌య‌ప‌డింద‌ని కాదు.. ఈసారి బ‌లంగా దాడి చేసేందుకు అని. ఈ మాట చాలాసార్లు నిజ‌మ‌ని తేలింది. ఇప్పుడు కూడా.

గ‌తేడాది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల జీవితాల‌తో ఓ ఆట ఆడుకున్న క‌రోనా వేర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే ప‌ట్టి మ‌ళ్లీ విజృంభిస్తోంది.

అనేక రూపాల్లోకి మారిన ఈ వైర‌స్ ఎప్పుడు ఎవ‌రిపై ఎలా దాడి చేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.

మ‌ళ్లీ కరోనా కలకలం

తాజాగా తెలంగాణాలో క‌రోనా కేసులు పెరుతున్నాయి. రాష్ట్రంలో కొత్త‌గా 157 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వర‌కు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 2,97,435కి చేరింది.

ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్టు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. అయితే 1715 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, 649 మంది హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స సొందుతున్నార‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది.

క‌రోనా వైర‌స్ పూర్తిగా త‌గ్గిపోయింద‌నుకుంటున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో గ‌త రెండ్రోజుల్లో 33 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

తొలి రోజు గురువారం 16 మందికి, రెండో రోజు శుక్ర‌వారం (19-2-2021) 17 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు అధికారులు తెలిపారు.

గ్రామంలో వైద్య శిబిరం

ఓ వ్య‌క్తి అంత్య‌క్రియ‌ల ద్వారా ఈ గ్రామంలో క‌రోనా సోకిన వైనం బ‌య‌ట‌ప‌డింది. గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.

తర్వాత వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని తేలింది.

శుక్రవారం 87 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 17 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో మొత్తం 33మందికి కరోనా సోకిందని హెల్త్‌ సూపర్‌ వైజర్‌ తెలిపారు.

వారందరిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన మందులు అందిస్తున్నారు. అంతేకాదు పెద్ద‌ప‌ల్లి బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టులు చేశారు.

వీరిలో 10 మందికి పాజిటివ్ రావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ టోల్‌గేట్ మీదుగా రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి.

దీంతో కొద్దిరోజులుగా ఈ మార్గంలో వెళ్లిన వాహనదారులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం.

ఈ రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా భారత్ లో 13,993 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.

ఇందులో 1,06,78,048 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 1,43,127 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.