
పెళ్లి అంటే ఆ ఇంట్లో ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంటా చెప్పనవసరం లేదు. పెళ్లయిన రోజు రాత్రి బారాత్ ఉంటుంది.
ఆ బారాత్‌లో ఆడ, మగ, పిల్ల పెద్ద అనే తేడా లేకుండ డ్యాన్స్‌లు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. అది సర్వసాధారణం.
అయితే ఉత్తరాదిలో పెళ్లి చేసుకునేందుకు వధువు, వరుడు ఓ బారాత్‌లా ఊరేగింపుగా వెళతారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో పెళ్లి సమయంలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి ఓ నవ వధువు టాప్ లేని కారులో నిలబడి పెళ్లి మండపానికి బయల్దేరింది. ఆమె వెంట బంధువులు, అతిథులు డ్యాన్స్ చేస్తూ హుషారుగా, ఆనందంగా ఊరేగింపుగా వెళుతున్నారు.
ఈ ఊరేగింపు వీధుల్లో నుంచి ప్రధాన రహదారి మీదకు చేరుకుంది. బంధువుల్లో ఏమాత్రం జోరు తగ్గలేదు. డీజే మ్యూజిక్‌లో బంధువులు డ్యాన్స్‌లు చేస్తుంటే.. నవ వధువు టాప్‌లేని కారులో నిలబడి డ్యాన్స్ చేస్తోంది.
ఈ సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అటువైపుగా వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఆ ఊరేగింపులోకి దూసుకొచ్చింది.
ఊరేగింపులో హుషారుగా డ్యాన్స్‌లు చేస్తున్న బంధువులు, అతిథులను ఢీ కొట్టింది. ఆ కారు దూసుకొచ్చిన వేగానికి వాళ్లంతా గాల్లోకి ఎగిరిపడ్డారు.
ఆ కారు నవ వధువు ఉన్న కారును ఢీ కొట్టకుండా వెంట్రుకవాసిలో పక్క నుంచి వెళ్లిపోయింది.
బంధువులు, మిత్రులు, అతిథులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ నవ వధువుకు మాత్రం చీమ కుట్టినంత కూడా దెబ్బలు తగలేదు.
ఈ ఘటనలో మొత్తం 13 మందికి తీవ్ర గాయాలైనట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదం చేసిన ఆ కారు డ్రైవరు దాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.