
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ డేటాపై అనేక అనుమానాలున్నాయి. దీంతో ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన యూజర్ల డేటాను భద్రంగా ఉంచడం కోసం చర్యలు చేపట్టింది.
యాపిల్ స్టోర్‌లోని అన్ని యాప్స్ ప్రైవసీ లేబుల్స్‌ను పొందుపరచాలని ప్రకటించింది. దీన్ని గతేడాది డిసెంబర్ 8 నుంచి తప్పనిసరి చేస్తూ అన్ని iOS యాప్స్‌కు తెలియజేసింది.
దీంతో ఆ యాప్స్ అన్నీ ప్రైవసీ లేబుల్‌ను ప్రకటించే బిజీలో ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ నేతృత్వంలోని gmail కూడా తన iOS యాప్‌ను అప్‌డేట్ చేసింది.
ఈ అప్‌డేట్‌లో ప్రైవసీ లేబుల్‌ను జతచేసింది. gmailను ఉచితంగా వినియోగించే వారి నుంచి తమ కంపెనీ ఎటువంటి డేటాను సేకరిస్తుందో ఆ ప్రైవసీ లేబుల్‌లో వెల్లడించింది.
గూగుల్ తన gmailతో పాటు YouTube iOS యాప్‌ను అప్‌డేట్ చేసింది. అయితే గూగుల్ ఫొటోస్, డ్రైవ్, మ్యాప్స్ వంటి వాటిని ఇంకా అప్‌డేట్ చేయలేదు.
మీ ఐఫోన్‌లోని Gmail యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ప్రైవసీ లేబుల్ మీకు ప్రత్యక్షమవుతుంది. మీ నుంచి ఎటువంటి వ్యక్తిగత డేటాను సేకరిస్తుందనే వివరాలను అందులో ఉంటాయి.
ఆండ్రాయిడ్ వినియోగదారుల విషయంలోనూ ఇటువంటి సమాచారాన్నే సేకరిస్తుంది. ఇలా సేకరించిన వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీలకు గూగుల్ చేరవేస్తుంది.
మీ వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలను అనలిటిక్స్ ద్వారా పసిగట్టి ఆయా కంపెనీలు వారి సేల్స్ పెంచుకోవడానికి మీ మెయిల్‌కు ప్రకటనలు పంపిస్తుంటాయి. వ్యక్తిగత డేటా అంటే.. గూగుల్ మీ నుండి ఆన్లైన్ కొనుగోళ్ల హిస్టరీ, లొకేషన్,
మెయిల్ అడ్రస్, ఫోటోలు లేదా వీడియోలు, ఆడియో డేటా, ఇతర కంటెంట్, బ్రౌజింగ్ హిస్టరీ, యూజర్ ఐడీ, డివైజ్ ఐడీ, యూజర్ డేటా, అడ్వర్టైజింగ్ డేటా, క్రాష్ డేటా, పర్ఫార్మెన్స్ డేటా వంటి వ్యక్తిగత డేటాను సేకరిస్తుంది.
ఈ డేటా ఉచిత జీమెయిల్ యూజర్ల నుంచి మాత్రమే సేకరిస్తుంది. బిజినెస్ అకౌంట్ల జోలికి పోదు. ఎందుకంటే బిజినెస్ అకౌంట్స్ నిర్ణీత రుసుము చెల్లించి గూగుల్ వర్క్ స్పేస్‌ను కొనుగోలు చేస్తారు.
అందువల్ల, వారి కంపెనీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ గూగుల్ పంచుకోదు.