మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ

373
kothi-womens-college-as-university

కోఠి ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి ఆయన ఆమోదంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తామని తెలిపారు. గురువారం కోఠి ఉమెన్స్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాలలో ఉన్న పరిస్థితులను పరిశీలించి, బోధనా తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.



దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉమెన్స్ కళాశాలను భవనాలను క్షణ్ణంగా తిరిగి పరిశీలించారు. హైదరాబాద్ నడిబొడ్డున 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కళాశాలలో బోధనా వసతులు బాగున్నాయని, కళాశాల వాతావరణం విద్యార్థులకు అనుకూలంగా ఉందని మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులు ఉండడంతోపాటు విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని, అందుకే విశ్వవిద్యాలంగా మార్చడానికి అనుకూలంగా ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకటి ఉండగా విభజన అనంతరం అది ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని, దీంతో తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దృష్టికి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం ఇందుకు సహాయం చేయాలని వివరించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కళాశాలను చూసిన తర్వాత తెలంగాణకు కావాల్సిన మహిళా విశ్వవిద్యాలయానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని గుర్తించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకోసం రాబోయే నెలరోజుల్లో ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి కావాల్సిన వౌలిక వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 42 యూజీ, పీజీ కోర్సులు నడుస్తున్నాయని, ఒక్క పరిశోధన మాత్రం లేదని, విశ్వవిద్యాలంగా మారితే పరిశోధన కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.

ఓయూ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ 200 కోట్ల రూపాయలను కేటాయించారని, ఇందులో 37 కోట్లు కోఠి ఉమెన్స్ కళాశాలకు అందాయని, దీంతో భవనాల మరమ్మతులు జరుగుతున్నాయని, అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత కావాల్సిన ఇతర సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. విద్యాశాఖామంత్రితో పాటు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయు వీసీ రాంచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ ఆత్మ పాల్గొన్నారు.