పెరుగులో కిస్‌మిస్‌ను క‌లుపుకుని తింటే…

280

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. అందుకే వేస‌వి కాలంలో చాలా మంది ల‌స్సీని తీసుకుంటుంటారు.

పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ‌ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది.

బీపీని క్రమబద్దీకరిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ పెరుగు తినాలి. కానీ చాలామంది రోజూ భోజనంలో పెరుగు తినడానికి ఇష్టపడరు.

ఇలాంటి వారు దాన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా పెరుగును ఉదయం మిడ్ మార్నింగ్ స్నాక్ (ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు స్నాక్) గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.

దీనికోసం పాలల్లో కిస్‌మిస్‌ లేదా ఎండుద్రాక్ష (రైసిన్లు) కలిపి కొత్త రకం పెరుగు తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను సైతం అందిస్తుంది.

కరోనా తరువాత చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం, పని ఒత్తిడి, పోషకాహార లోపం వంటివి కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతున్నాయి.

దీనివల్ల మలబద్దకం, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. సమయానికి తినకపోవడం వల్ల జుట్టు రాలిపోవడం, నిద్ర లేమి వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ సమస్యలకు పెరుగు, కిస్‌మిస్‌ కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ సూచిస్తున్నారు.

దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.

ప్ర‌యోజ‌నాలేంటి?

పెరుగు ఒక ప్రోబయోటిక్ పదార్థం. కిస్‌మిస్‌లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. జీవక్రియలను మెరుగుపరిచే మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

పేగుల్లో ఏర్పడే మంటను పెరుగు, కిస్‌మిస్‌ తగ్గిస్తాయి. ఇవి నిద్రలేమిని కూడా దూరం చేస్తాయి.

పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఎముకలు, కీళ్ల సమస్యను ఇవి దూరం చేస్తాయి.

త‌యారు చేసుకోవ‌డ‌మెలా?

ఒక గిన్నెలో కొవ్వు తీయని తాజా పాలను తీసుకొని బాగా వేడి చేయాలి. కాస్త చల్చార్చిన తరువాత వీటిలో కిస్‌మిస్‌ వేయాలి.

ఆ తరువాత కాసేపు పాలను బాగా కలపాలి. అనంతరం దీంట్లో కాస్త మజ్జిగ లేదా పెరుగు వేసి తోడుపెట్టుకోవాలి.

ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా చిన్న చిన్న బౌల్స్ లో వేసి విడివిడిగా కిస్ మిస్ లు వేసి తోడు పెట్టుకుంటే ఇంకా మంచిది.

ఎనిమిది నుంచి 12 గంటల తరువాత పెరుగు సిద్ధమవుతుంది. బాగా తోడుకున్న పెరుగు తినడానికి సిద్ధంగా ఉంటుంది.

పెరుగన్నం తిననివారు భోజనం తరువాత నేరుగా దీన్ని తీసుకోవ‌చ్చు. లేదా స్నాక్ గా కూడా తీసుకోవచ్చు.

గర్భం దాల్చాలనుకునే మహిళలు కిస్‌మిస్‌తో పాటు ఖర్జూరాలను కూడా పాలల్లో వేసుకోవచ్చు.