ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం పదో తరగతి గణితం ప్రశ్నపత్రం లీకయ్యింది. కొడిమ్యాల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, కోనాపూర్‌కు చెందిన వడ్లకొండ రమేష్, శ్రీనివాస్‌తో పాటు పద్మ, లింగవ్వ, రాధ ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు కలిసి పరీక్షా కేంద్రానికి అందుబాటులో వున్న ఒక గదిలో కూర్చొని ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలను, జవాబులను వాట్సప్ ద్వారా వేరే వారికి చేరవేస్తున్నారు.
విషయం తెలుసుకున్న కొడిమ్యాల ఎస్సై సతీష్ కుమార్ సివిల్ డ్రెస్‌లో పరీక్షా కేంద్రానికి దగ్గర్లో వారున్న గదికి చేరుకుని ఇదేంటని ప్రశ్నించారు. దీంతో ఎవడివి నీవు అంటూ సదరు ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఐపై దాడికి పాల్పడ్డారు. వచ్చిన వ్యక్తి ఎస్‌ఐ అని తెలిసి ముగ్గురు మహిళ ఉపాధ్యాయులు పరారయ్యారు. సత్యనారాయణ, వడ్లకొండ రమేష్‌ను ఎస్‌ఐ రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. లీకేజీతో సంబంధమున్న ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. కొడమ్యాల ఎంఈవోతో పాటు పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. కొడిమ్యాల ఎంఈవో వెంకటేశ్వర్‌రావు, మోడల్ స్కూల్ హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు రమేశ్, శ్రీనివాస్, పద్మ, రాధ, రాజేశ్వరీ, సత్యనారాయణ, కేజీబీవీ అధికారి లింగవ్వ, కోనాపూర్ స్కూల్ హెచ్‌ఎం చంద్రమోహన్‌పై కేసులు పెట్టారు.