ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, సరైన వ్యాయామం లేని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్‌లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. ఇక డయాబెటిస్‌తో పాటు అత్యధికులను బాధిస్తున్న మరో సమస్య ఒబేసిటి.
ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు. మెంతి గింజలతో తయారు చేసే తేనీరుతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్‌గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు. వేడినీళ్లలో గుప్పెడు మెంతి గింజలను కలుపుకొని తాగడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. తరచుగా ఈ టీని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చని పేర్కొంటున్నారు.
మెంతి టీ తయారీ
ఒక టీ స్పూను మెంతి గింజలను తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పులో నీటిని తీసుకుని వేడి చేసి.. అందులో మెంతి పొడి కలపాలి. కావాలనుకుంటే టీ స్పూన్ తేనె, తులసి ఆకులు, తేయాకులను కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత ఈ టీని తాగినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు.