పల్లె సంస్కృతికి జానపదమే ప్రతీకగా నిలుస్తోందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. గోదావరిఖని మార్కండేయకాలనీలోని స్నేహసాహితి గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన భాష, సంస్కృతి నాడు-నేడు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల శ్వాస, ధ్యాసతోనే జానపదం ముడిపడి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో జానపదాలకు, ఆదివాసీ, మైనార్టీల భాషలకు, సంస్కృతులకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. భాష, సంస్కృతికి పట్టం కట్టేందుకు రాజ్యాంగానికి వ్యతిరేక ధిక్కార స్వరం వినిపించాలని తెలిపారు. సదస్సులో పాల్గొన్న ప్రముఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ గడీలు పోయి కోటలు పోయి మనిషిని నిలబెట్టే సాహిత్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండటానికి పింఛన్లు పంపిణీ చేయడం కాదు, నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలన్నారు.
విద్యార్థులపై ఒత్తిడితోనే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, ఒత్తిడి లేని విధానాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రచయిత బొల్లంపెల్లి రమాదేవి రాసిన ‘హృదయ స్పందన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వినాయక్‌రెడ్డి, జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేష్, అల్లం వీరయ్య, నైనాల గోవర్థన్, సారయ్య, వేల్పుల నారాయణ, సదానందం, రవీందర్‌రెడ్డి, రాకుమార, రాజేశం, కొమురయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.