తొలగిన నిమిషం నిబంధన – తలొగ్గిన ప్రభుత్వం

588
Removed 1 minute clause for 10th class exams

పోటీ పరీక్షలకు విధించే నిమిషం నిబంధన పబ్లిక్‌ పరీక్షలకు వర్తింపజేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇంటర్‌ విద్యార్థులు నిమిషం నిబంధనతో అధికారుల కాళ్లు మొక్కిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలలో చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అందువల్ల నిమిషం ఆలస్యం కావడం వల్ల విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. ఇంటర్‌ విధానాన్నే ‘పది’కి వర్తింపజేస్తారనే ఊహాగానాలకు అధికారులు ఎట్టకేలకు తెరదించారు. ఈ నిబంధనను పూర్తిగా తొలగించి పాత విధానాన్నే (అరగంట) అమలు చేయకుండా ఐదు నిమిషాల నిబంధన విధించారు. దీంతో విద్యార్థులకు కొంత ఊరట లభించింది. ఏడాది అంతా కష్టపడి చదివి ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది కాదనేది అందరి అభిప్రాయం.



రెండు రోజుల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సైతం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఛీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకం ప్రక్రియ పూర్తి చేసి పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న హాల్‌టికెట్‌ నెంబర్లు సైతం పరీక్ష కేంద్రాల వారీగా కేటాయించనున్నారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ తెరదించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పది పరీక్షలు కొనసాగుతాయి. అయితే నిర్ణీత సమయం 9.30 గంటల తరవాత ఐదు నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. ఆ తరువాత వచ్చే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిందే. కాగా గతంలో నిర్ణీత సమయం తరువాత అరగంట వరకు సైతం విద్యార్థులను అనుమతించే వెసులుబాటు ఉండేది.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

పది పరీక్షలు సాధారణంగా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు రాయడానికి రావలసి ఉంటుంది. ఆటో రిక్షా, బస్సులు, ఇతర వాహనాల్లో వారు రోజూ వచ్చి పరీక్షలు రాస్తుంటారు. నిర్ణీత సమయం 9.30 గంటలను దృష్టిలో ఉంచుకొని వారు ప్రయాణించే దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటిని బేరీజు వేసుకొని ఇంటి నుంచి బయలు దేరడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోవలసి ఉంటుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా ఐదు నిముషాల నిబంధనను కచ్చితంగా మనస్సులో ఉంచుకొని ముందుకు సాగాలి. సాధ్యమైనంత వరకు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం అన్నీ విధాలుగా మంచిది.



తల్లిదండ్రుల సహకారం అవసరం

పది పరీక్షలు రాసే విద్యార్థులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు, పోషకుల అండదండలు అవసరమే. పరీక్షలు ముగిసే వరకు పిల్లలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఉదయాన్నే నిద్రలేపి సమయానుకూలంగా పరీక్షలకు వెళ్లేవిధంగా సన్నద్ధం చేయాలి. ఏడాది అంతా ఎలా ఉన్నప్పటికిని పరీక్షల సమయంలో మాత్రం ఇంట్లో వారి సహకారం తప్పక ఉండాల్సిందే. లేదంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఐదు నిమిషాలు కాదు, అరగంట ఆలస్యంగా వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేపధ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏమంటున్నారో అభిప్రాయాలు వారి మాటల్లోనే….

జిల్లా పరీక్ష రాసే విద్యార్థులు

నిమిషం నిబంధన ఉంటే ఇబ్బంది- రమ్య, విద్యార్థిని
ఇంటర్‌ మాదిరిగానే ‘పది’ పరీక్షలకు నిముషం నిబంధన ఉంటే ఇబ్బందిగా ఉండేది. గ్రామీణ ప్రాంతం నుంచి మండల కేంద్రానికి వెళ్లడానికి ఒక్కొసారి వాహనాలు దొరక్క పోవచ్చు. అలాంటపుడు నిమిషం అనేది కుంగుబాటుకు దారి తీస్తుంది. ఇప్పుడు ఐదు నిమిషాలకు అధికారులు చెప్పడం సరియైందే అనిపిస్తుంది.

విద్యార్థులకు సమయపాలన తెలుస్తోంది – రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయుడు
ప్రతి విద్యార్థి సమయపాలన పాటించాలి. ప్రభుత్వం విధించిన ఐదు నిమిషాల నిబంధన ఫర్వాలేదు. ఒక్క నిమిషం అనేది మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కేంద్రానికి ముందుగా చేరుకోవడం వల్ల విద్యార్థికి మంచే జరుగుతుంది.ఆలస్యంగా వస్తే ఆందోళన పడుతుంటాడు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం – రాజమౌళి, ఉపాధ్యాయుడు
ప్రభుత్వం ఐదు నిమిషాల నిబంధన విధించడం హర్షణీయం. నిమిషం నిబంధన ఉంటే విద్యార్థులు ఇబ్బంది పడేవారే. పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతిస్తున్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.