సైబర్ సెక్యూరిటీ రంగం లో కెరీర్ గ్యారెంటీ

865
best career cyber security

వెబ్‌సైట్ హ్యాకింగ్…. ఈ-మెయిల్ హ్యాకింగ్.. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాల చోరీ! ప్రభుత్వ వెబ్‌సైట్లపై హ్యాకర్ల దాడి.. కీలక సమాచారం తస్కరణ..!
ఇలాంటి వార్తలు మనం టీవీల్లో వినని, వార్తా పత్రికల్లో చదవని రోజు లేదు. టెక్నాలజీ సాయంతో ఆన్‌లైన్‌లో క్షణాల్లో ఎన్నో పనులు పూర్తిచేసుకోవచ్చు.మరోవైపు.. సైబర్ నేరగాళ్ల బారిన పడి భారీగా నష్టపోతున్న వైనం..! ఇలాంటి సైబర్ నేరాలను అడ్డుకునే సరికొత్త సాధనమే.. సైబర్ సెక్యూరిటీ!!ఆన్‌లైన్ కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీతో కెరీర్ అవకాశాలపై విశ్లేషణ…

‘‘మేము నిర్వహించిన ఆన్‌లైన్ లాటరీలో మీకు.. 2 మిలియన్ల డాలర్ల బహుమతి లభించింది. ఈ మొత్తం నగదు మీకు చేరాలంటే.. మీ బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వివరాలతో మెయిల్ పంపండి’’ – ఇటీవల ఈ-మెయిల్ వినియోగదారులకు వస్తున్న మెసేజ్‌లు. ఇలాంటి మెసేజ్‌లకు స్పందిస్తే ఇక అంతే సంగతులు.. మీరు హ్యాకర్ల బారినపడటం ఖాయం!!



 

సైబర్ సెక్యూరిటీ అంటే.. ?
ఐటీ టూల్స్ ఉపయోగించి ఆన్‌లైన్ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. కంప్యూటర్లు, నెట్‌వర్క్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, డేటా.. చోరీకాకుండా సైబర్ సెక్యూరిటీ రక్షణగా నిలుస్తుంది. అందుకే ఆన్‌లైన్ విధానంలో కార్యకలాపాలు జరిపే చిన్నాపెద్దా కంపెనీలకు సైబర్‌సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడింది. సైబర్ సెక్యూరిటీలో ముఖ్య విభాగాలు.. డేటాసెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇన్‌సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, ఐటీ సెక్యూరిటీ.

డేటా సెక్యూరిటీ :
సంస్థలు ఆన్‌లైన్‌లో సేవలు అందించే క్రమంలో డేటా మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆయా కంపెనీల క్లయింట్ సంస్థలు, వారి కస్టమర్లకు సంబంధించిన వివరాలు.. అదే విధంగా తాము వారికి అందిస్తున్న సేవలకు సంబంధించిన డేటాను భద్రంగా నిక్షిప్తం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా డేటా నిక్షిప్తం, అప్‌డేట్ సమయంలో చిన్నపాటి తప్పిదం దొర్లినా.. హ్యాకర్ల చేతిలో చిక్కినట్లే. ఎంతో విలువైన డేటా వివరాలను పటిష్టంగా నిర్వహించడం, డేటాను ఇతరులు యాక్సెస్ చేసే వీలు లేకుండా చూసే విభాగమే డేటా సెక్యూరిటీ. సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన సమాచారంలో మార్పులు చేర్పులు, భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్ విభాగం సూచిస్తుంది.

అప్లికేషన్ సెక్యూరిటీ :
ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించే క్రమంలో అప్లికేషన్ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలు, వాటికి సంబంధించిన నైపుణ్యాలు అందించే విభాగం అప్లికేషన్ సెక్యూరిటీ.

ఐటీ సెక్యూరిటీ :
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు సురక్షిత అప్లికేషన్స్‌ను రూపొందించడం ఐటీ సెక్యూరిటీ నిపుణులు ముఖ్య బాధ్యత. హ్యాకింగ్ చేసిన డొమైన్/ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్ చేశారో గుర్తించడం; మాల్వేర్‌ను తొలగించడం వంటివి చేస్తారు. లాన్ (లోకల్ ఏరియా నెట్‌వర్క్) సెక్యూరిటీ; సర్వర్ సెక్యూరిటీ; రూటర్ సెక్యూరిటీ; డిజిటల్ సెక్యూరిటీ విభాగాల్లోనూ ఈ నిపుణుల అవసరం పెరుగుతోంది.

కలిసొచ్చిన జీడీపీఆర్‌ఏ :
సైబర్ సెక్యూరిటీ నిపుణులకు కెరీర్ పరంగా దోహదం చేస్తున్న మరో ప్రధాన పరిణామం.. యూరప్‌లో అమలు చేస్తున్న జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం (జీడీపీఆర్‌ఏ). ఈ చట్టం కారణంగా భారతీయ సంస్థలు తమ డేటా బేస్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రిపోర్ట్ 2018-2021 ప్రకారం వచ్చే అయిదేళ్లలో సైబర్ నేరాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఇంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రముఖ జాబ్ సైట్ ఇన్‌డీడ్ నివేదిక ప్రకారం 2017, జనవరి-2018, మార్చి మధ్యకాలంలో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల సంఖ్య 150 శాతం పెరిగింది. ముఖ్యంగా డేటా ప్రొటెక్షన్ విభాగంలో ఉద్యోగాల సంఖ్య 143 శాతం పెరగడం విశేషం. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం మనదేశంలోనే 2020 నాటికి దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడనుంది.


 

జాబ్ ప్రొఫైల్స్..
ప్రస్తుతం అయిదు స్థాయిల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను సంస్థలు నియమించుకుంటున్నాయి. అవి.. ఎంట్రీ లెవల్ (ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హోదా); మిడిల్ లెవల్(మేనేజర్ హోదా); సీనియర్ లెవల్. సీనియర్ లెవల్‌లోనే మరో రెండు హోదాలు లభిస్తున్నాయి. అవి.. సెక్యూరిటీ అడ్వయిజర్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్.
ఎంట్రీ లెవల్‌లో రూ.20 వేల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు.

అందరికీ అవకాశాలు..
సైబర్ సెక్యూరిటీ రంగంలో అవకాశాల పరంగా ఐటీ/టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కొంత ముందంజలో నిలుస్తారనే అభిప్రాయముంది. ఐటీ అప్లికేషన్స్‌కు సంబంధించి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌లో బేసిక్స్ కాస్త ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్ సెక్యూరిటీ సంబంధిత కోర్సుల్లో అడుగుపెట్టి.. ముఖ్యంగా ఇంటర్నెట్, డేటామేనేజ్‌మెంట్/ఇన్ఫర్మేషన్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అంశాల్లో పట్టు సాధించడం ద్వారా కొలువులు సొంతం చేసుకోవచ్చు.

పీజీ స్థాయిలో స్పెషలైజేషన్ :
బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులో లేవు. బీసీఏ, బీటెక్ కోర్సుల్లో ఒక సబ్జెక్ట్‌గా ఈ అంశాన్ని బోధిస్తున్నారు. పీజీ స్థాయిలో మాత్రం ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందిస్తున్న కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు

జేఎన్‌టీయూ – హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in

ఐఐఐటీ – అలహాబాద్
వెబ్‌సైట్: www.clis.iiita.ac.in

సీడాక్
వెబ్‌సైట్: www.cdac.in

ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా ఎంటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పేరుతో స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తున్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా వీటిలో ప్రవేశం పొందొచ్చు.



 

సర్టిఫికేషన్లు తప్పనిసరి:
సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు పలు సర్టిఫికేషన్‌‌స ద్వారా స్కిల్స్ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యమైన సర్టిఫికేషన్లు:
1. సిస్కో సంస్థ అందించే సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ,
వెబ్‌సైట్: www.cisco.com

2. EC కౌన్సిల్ నిర్వహించే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్,
వెబ్‌సైట్: www.eccouncil.org

3. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సులు,
వెబ్‌సైట్: www.iisecurity.in

4. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ అందించే సర్టిఫికేషన్ కోర్సులు,
వెబ్‌సైట్: www.dsci.in

అన్ని రంగాల్లోనూ..
స్మార్ట్‌ఫోన్స్ నుంచి వెబ్ డొమైన్స్ వరకూ.. అన్నీ హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. వీటితోపాటు ఫేక్ మెయిల్స్, మాల్‌వేర్స్ కూడా సర్వ సాధారణంగా మారాయి. దాంతో ఐటీ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, ఫిన్-టెక్.. ఇలా అన్ని రంగాల్లోనూ సైబర్ సెక్యూరిటీ నిపుణులనునియమించుకుంటున్నాయి. సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న వారికి ఉజ్వల కెరీర్ అవకాశాలు లభించే అవకాశముంది.
– ప్రొఫెసర్ టి.భీమార్జున రెడ్డి, ఐఐటీ-హెచ్

సైబర్ నిపుణులకు డిమాండ్:
కొత్త చట్టాల ప్రకారం కార్యకలాపాలు నిర్వహించడానికి కంపెనీలకు సైబర్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. సాంకేతిక సంస్థలు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ, సైబర్ ‘లా’స్ కోణంలో నిబంధనల మేరకు వ్యవహరించేలా నిపుణులను నియమించుకుంటున్నప్పటికీ.. ఈ-ప్రైవసీ అవసరాలు పెరుగుతుండటంతో ఈ రంగంలో మరింత మంది అవసరం ఉంటుంది.

Courtesy: By shashikumar, Source link