చీరతో ఉరి బిగించి తన భర్తను హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకొంది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ఏరియాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. సరితా దేవి (35), సికందర్ సాహ్నీ (38) తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫతేపూర్ బేరి ఏరియాలో ఉంటున్నారు.
అయితే తాగుడుకు బానిసైన సికందర్ రోజూ తప్పతాగి వచ్చి భార్యను కొట్టేవాడు.
పిల్లల ముందే అసభ్య పదజాలంతో దూషించేవాడు. ఆదివారం రాత్రి కూడా పూటుగా మద్యం సేవించి వచ్చిన భర్త ఆమెతో గొడవపడి చేయిచేసుకున్నాడు.
భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతడు నిద్రపోగానే చీరతో మెడకు ఉరిబిగించి హత్యచేసింది. ఈ మేరకు పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.