వరంగల్ లో హెల్మెట్ ఉంటేనే ఆఫీస్ లోకి ఎంట్రీ – కొత్త రూల్

415
warangal police new rule - helmet must
file photo

హెల్మెట్ వాడకం కచ్చితంగా అమలు చేసేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రణాళిక రెడీ చేశారు. టూవీలర్ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. రూల్స్ సామాన్యులకే కాదు పోలీసులకు వర్తిస్తాయంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ నిర్ణయం పోలీస్ కమిషనరేట్ నుంచే మొదలు పెట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి బైక్ పై హెల్మెట్ లేకుండా వస్తున్న పోలీసులను గేటు దగ్గరే ఆపేస్తున్నారు.

పోలీస్ బాస్ లు తీసుకున్న నిర్ణయానికి కిందస్థాయి సిబ్బంది నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తోటి కానిస్టేబుల్స్ చనిపోయి వారి కుటుంబాలు వీధిన పడిన ఘటనలు ఉన్నాయని 2009 బ్యాచ్ కానిస్టేబుల్ తిరుపతి చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హెల్మెట్ వాడుతున్నామన్నారు. రూల్స్ తాము పాటించకపోతే జనాలకు ఏం చెబుతామంటున్నారు మరో కానిస్టేబుల్ బిక్షపతి. హెల్మెట్ పెట్టుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు అధికారులు. ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని చెబుతున్నారు. పోలీసులకూ హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ మురళీ. హెల్మెట్లు వాడని సిబ్బందిని కార్యాలయాల్లోకి రానివ్వమంటున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ అధికారులు.