ర‌గులుతున్న ఉక్కు న‌గ‌రం

264

ఉక్కు న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం ర‌గులుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌ర‌ణ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది.

దీంతో ఆ కార్మాగారం కార్మికులు ఉద్య‌మాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు కార్మాగారాన్ని అమ్మి తీర‌తామ‌ని లొక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సోమ‌వారం (8-3-2021) ప్ర‌క‌టించ‌డంతో కార్మికులు మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్నారు.

స్టీల్‌ సిటీ భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన సోమ‌వారం రాత్రి నుంచి కొనసాగుతోంది.

కేంద్రం ప్రకటనతో సాగర తీరం అట్టుడికిపోతోంది. ఎటు చూసినా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు.

రాత్రి నుంచి స్టీల్‌ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రహదారులను దిగ్బంధించారు.

కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ దగ్గర ఆందోళనలకు దిగారు. పోలీసుల చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదుజ‌. ఉక్కు పిడికిలి బిగించి నినాదాలు చేశారు.

పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స‌మాధాన‌మిచ్చారు.

ఆమె ఇచ్చిన స‌మాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు భగ్గుమంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు రామాయపట్నం పోర్టు విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే ఎదురైంది.

ఇవాళ స్టీల్‌ ప్లాంట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించిన ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని కార్మికులు అంటున్నారు.

జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ మేయిన్‌ గేట్‌ దగ్గర కార్మికులంతా మానవహారంతో దిగ్బంధించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటన ప్రతులను దగ్దం చేశారు.

కేంద్రం తీరుకు నిరసనగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉక్కు ఉద్యమానికి అజ్యం పోసినట్లైంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామ‌ని ఆమె తేల్చిచెప్పారు.

తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు.