
తప్పుడు పనులు ఏదో ఒకసారి మనలను చట్టానికి పట్టిస్తాయి. ఇది అనేకసార్లు రుజువైంది. అయినా తప్పులు చేస్తూనే ఉన్నారు.
ఎన్నికల వేళ డబ్బును ఎంత తెలివిగా, అక్రమంగా తరలించాలనుకున్నా ఏదో ఒక రోజు పట్టుబడతాం. ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
అక్రమ మద్యం, డబ్బుకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్ట్‌ల దగ్గర నిఘా పెంచారు. అలాగే ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విశాఖలో భారీగా డబ్బు పట్టుబడింది. సిరిపురానికి చెందిన వ్యాపారి రామకృష్ణారావు పాత గాజువాక చైతన్యనగర్ నుంచి కారులో డబ్బు తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే రంగంలోకి దిగి పోలీసులు కారు ఆపి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.వ్యాపారి రామకృష్ణారావు కారు సీటుకు సీక్రెట్ లాకర్ ఉన్నట్లు గుర్తించారు.
ఆ లాకర్‌ను ఓపెన్ చేసి చూడగా మొత్తం రూ.25 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఆ డబ్బుకు ఎలాంటి బిల్లులు, డాక్యుమెంట్లు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
తాను భూమి కొనుగోలు నిమిత్తం ఆ డబ్బును తీసుకెళ్తున్నట్లు రామకృష్ణారావు పోలీసులకు తెలిపారు. ఆ డబ్బును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మరోవైపు ఒడిశా కొరాపుట్ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్ పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు.
పెద్ద ఎత్తున డబ్బు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డబ్బు మొత్తం విశాఖపట్నంకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు.
ఆ డబ్బు మొత్తం నకిలీ నోట్లుగా తేలింది. ఆ నకిలీ నోట్ల విలువ రూ.7.90 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాయ్‌పూర్ నుంచి విశాఖలో ఓ వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.