ద్రవ్యోల్బణం కోరల్లో వెనెజులా… టాయిలెట్‌ పేపర్‌గా కరెన్సీ!

351
venujula currency

క్రితం సంవత్సరం రూపాయికి కొనుక్కున్న వస్తువు ఈ ఏడాది ఏకంగా 10 లక్షల రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే? అదీ కాదు.. కాసేపటి క్రితం 5 రూపాయలకు కొన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ని 10 నిమిషాల తర్వాత 10 రూపాయలకి.. ఆ తర్వాత మరో 10 నిమిషాలకు ఇరవై, ముప్ఫై, నలభై రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవడం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవడం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయ్‌లెట్‌ పేపర్‌ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయ్‌లెట్‌ పేపర్‌గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.

ఎందుకిలా అంటే..

క్రూడాయిల్‌ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్‌కూ డిమాండ్‌ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా, నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనెజులన్లు అమెరికన్‌ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగి.. వెనెజులా బొలివర్‌ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్‌ మార్కెట్‌ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్‌మార్కెట్‌ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర్నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనెజులన్లు (జనాభాలో దాదాపు పది శాతం) దేశం విడిచి వెళ్లిపోయారు.

కిలో టమాటా… 30,000పైమాటే..
లీటరు పాలు… దాదాపు.. 50,000

► 10 లక్షల శాతం: ఈ ఏడాది ఆఖరుకు వెనెజులాలో ద్రవ్యోల్బణం చేరబోయే స్థాయి (ఐఎంఎఫ్‌ అంచనా).
► ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్‌ ఫుర్టె స్థానంలో బొలివర్‌ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది. ఒక సోబ్రానో.. లక్ష ఫుర్టెలకు సమానం.
► ప్రస్తుతం 1 వెనెజులా బొలివర్‌ సొబ్రానో .. భారత కరెన్సీలో సుమారు రూ. 6.88కి సమానం.
► కిలో టమాటా దాదాపు 4,411 బొలివర్లు.. అంటే రూ.30,387 అన్నమాట. లీటరు పాలప్యాకెట్‌ ధర సుమారు 7,029 బొలివర్లు (రూ.48,400).