కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ‘83’

202
ranveer singh movie 83

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘83’. ఈ సినిమాలో రీల్‌ లైఫ్‌ కపిల్‌ దేవ్‌గా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఏవిధంగా గెలిచింది అన్న నేపథ్యంలో సినిమాను కబీర్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తుండగా.. మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌, అప్పటి టీమిండియా మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్‌ నటిస్తున్నారు. 2020 ఏప్రిల్‌ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ రోజు రణ్‌వీర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కపిల్‌ దేవ్‌గా తన ఫస్ట్‌లుక్‌ను రణ్‌వీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘నాకు ఎంతో ప్రత్యేకమైన రోజున హరియాణా హరికేన్‌ కపిల్‌దేవ్‌ను పరిచయం చేస్తున్నా’ అని రణ్‌వీర్‌ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఫొటోలో బంతిని ఎగరేస్తూ రణ్‌వీర్‌ లుక్‌ ఎంతో ఆకట్టుకుంది. కొద్ది గంటల్లోనే ఈ ఫొటోకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఫొటో పోస్టు చేసిన రెండు గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది లైక్‌ చేశారు. టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ స్పందిస్తూ.. ‘అచ్చం పాజీ(కపిల్‌ దేవ్‌)లాగే ఉన్నావ్‌. హ్యాపీ బర్త్‌డే బ్రో’ అని కామెంట్‌ చేశారు. బాలీవుడ్‌ నటులు అయుష్మాన్‌ ఖురానా, అహానా కుమ్రా, సన్య మల్హాత్రా తదితరులు కూడా రణ్‌వీర్‌ లుక్‌ను తెగ పొగిడారు.