రథం ఊరేగింపులో అపశృతి.. విద్యుత్ షాకుతో ఇద్దరు మృతి

181
Two killed electric shock chariot procession

ఆలయానికి రథాన్ని తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ షాకుతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగింది.

జిల్లాలోని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సమీపంలోని గుట్టపైనున్న వెంకటరమణ ఆలయానికి దాతలు, గ్రామస్థులు కలిసి కొత్త రథాన్ని చేయించారు.

నిన్న రథసప్తమిని పురస్కరించుకుని రథాన్ని అలంకరించి 21 మంది భక్తులు రథాన్ని లాగుకుంటూ ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయ సమీపంలో గుట్టకింద ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకాయి.

అది ఇనుముతో చేసిన రథం కావడంతో వెంటనే రథం మొత్తానికి విద్యుత్ ఆవరించింది.

దీంతో గ్రామానికి చెందిన సంజనోళ్ల చంద్రప్ప (35), దిడ్డిముంతల హన్మంతు (35) విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.