నాంపల్లి కోర్టు ఆవరణలో అడ్వ‌కేట్‌పై దాడి

270

అడ్వ‌కేట్ దంప‌తులు వామ‌న‌రావు, నాగ‌మ‌ణి దారుణ హ‌త్య‌ను మ‌రువ‌క ముందే మ‌రో లాయ‌ర్‌పై దాడి జ‌రిగింది. అయితే ఇక్క‌డ ఈ అడ్వ‌కేట్ చాక‌చ‌క్యంగా త‌ప్పించుకున్నాడు.

తోటి లాయ‌ర్లు అత‌డిని చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించారు. వివ‌రాల్లో వెళితే… నాంప‌ల్లి కోర్టులో విధులు నిర్వ‌హిస్తున్న ఓ న్యాయ‌వాదిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దాడికి దిగాడు.

దీన్ని గ‌మ‌నించిన తోటి లాయ‌ర్లు స‌దరు వ్య‌క్తిని ప‌క్క‌కు లాగేసి చిత‌క‌బాదారు. త‌ర్వాత పోలీసుల‌కు అప్ప‌గించారు.

దీంతో నాంపల్లి కోర్టు ఎదుట కాస్త ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్వల్ప ఘర్షణ వాతావారణం ఏర్పడింది. హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అందులోభాగంగా నాంపల్లి కోర్టులో కూడా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

అయితే లాయర్‌పై ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడన్న విషయం తెలియాల్సి ఉంది. న్యాయవాదులు వామనరావు, నాగమణి హంతకులను శిక్షించాలని, ఈ కేసు విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని నాంపల్లి క్రిమినల్‌ కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

వామనరావు దంపతులకు రక్షణ కల్పించడంలో విఫలమైన సీపీని వెంటనే సస్పెండ్‌ చేయాలని వారు కోరుతున్నారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లాయర్లను అరెస్ట్‌ చేయడం దారుణమని వారు అన్నారు.