జైల్లోనే ప్ర‌శాంతంగా ఉందంట‌

212

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. లాక్‌డౌన్ వ‌ల్ల ఎక్కువ సేపు కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపే అవ‌కాశం ల‌భించింది.

ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండ‌టం వ‌ల్ల భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు, గొడ‌వ‌లు కూడా వ‌చ్చాయి. అదే వేరే విష‌యం.

ఇళ్ల‌ల్లో ఉండ‌టం వ‌ల్ల అంద‌రూ సంతోషంగా ఉన్నార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఉద్యోగ రీత్యా కావ‌చ్చు.. వ్యాపారం రీత్యా కావ‌చ్చు కొంత మందికి బ‌య‌ట తిరిగే అల‌వాటు.

అందుకే పెద్ద‌లు ఒక సామెత చెప్పారు. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకోదు అని. ఎందుకంటే వాళ్లు వాటికి అల‌వాటు ప‌డ్డారు.

ఎప్పుడూ బ‌య‌ట తిరిగి వారు ఇంట్లో ఉండ‌టం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ముఖ్యంగా కుటుంబ స‌భ్యుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తే మ‌రీ క‌ష్టం.

ఎడ మొఖం పెడ మొఖం వేసుకుని ఉండాల్సి వ‌స్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఓ నిందితుడికి ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది.

బ‌ర్గెస్ హిల్ పోలీస్ స్టేష‌న్‌కు బుధ‌వారం (17-2-2021) సాయంత్రం ఓ వాంటెడ్ నిందుతుడు వ‌చ్చాడంట‌. త‌న‌ను అరెస్ట్ చేసి జైలుకు పంప‌మ‌ని అధికారుల‌ను రెక్వెస్ట్ చేసుకున్నాడు.

త‌న‌కు తానే లొంగిపోతున్నాన‌ని చెప్పాడు. ఎందుక‌ని అడిగితే.. ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో ఉండ‌టం కంటే జైల్లో ఉండ‌ట‌మే మంచిద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపాడు.

ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి జీవించ‌డం పీడ క‌ల‌లా ఉంద‌ని.. జైల్లో ప్ర‌శాంతంగా జీవించాల‌ని ఉంద‌ని చెప్పాడు. ఈ అరుదైన ఘ‌ట‌న‌ను జైలు అధికారి ట్వ‌ట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

‘ప్రశాంతక‌ర‌మైన‌ జీవితాన్ని కోరుకుంటున్న ఓ వ్యక్తి తనంతట తానే వ‌చ్చి లొంగిపోయాడు. ఇంటికి తిరిగి వెళ్లి కుటుంబ సభ్యులతో ఉండటం కంటే.. జైలుకు వెళ్లడమే మంచిదని అతడు తెలిపాడు’ అని ఆ అధికారి రాశారు.

దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఓ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ వల్ల ఇళ్లకే పరిమితమైన వ్యక్తుల్లో 5 శాతం మంది తమకు ఇష్ట‌మైన‌ వ్యక్తుల పట్ల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.

లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌, ఇప్సోస్ మోరి సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో పావు వంతు మంది తమ స్నేహితులు, కుటుంబీకులతో వాదనలు చేసుకున్నారని తేలింది.

ప్రతి 12 మందిలో ఒకరు తమ స్నేహితులు, బంధువులతో మాట్లాడటం లేదని సర్వేలో పేర్కొన్నారు.