ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..తిరుపతి బస్సుల్లో ఇకపై శీఘ్రదర్శనం టికెట్లు!

129
Apsrtc Bus

తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు.

రోజుకు 1000 టికెట్లను జారీ చేయనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్ లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.