టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న గొంతులు

490
TRS MLAs who want KTR‌ CM
  • టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న గొంతులు
  • కేటీఆర్‌ సీఎం కావాలంటున్న నేతలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలది ఇదే మాట
  • కేటీఆర్‌ సీఎం ఐతే తప్పేంటి?: తలసాని
  • కేటీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి: కొప్పుల

సీఎం కేసీఆర్‌ స్థానంలో ఆయన తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు ఈ ఆకాంక్షను వ్యక్తం చేయగా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బాట పట్టారు. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షను వెలిబుచ్చారు.

కాగా, చాలా మంది టీఆర్‌ఎస్‌ సీనియర్లు, ప్రజాప్రతినిధులు సీఎంగా కేటీఆర్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండవచ్చుననే విషయంపై చర్చించుకున్నారు. అధిష్ఠానం ముఖ్యుల నుంచి తమకు ఉన్న సమాచారం మేరకు ఇందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని అన్నారు. ఇక కొందరు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సైతం తమదైన శైలిలో స్పందించారు.

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని మంత్రి తలసాని అన్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్‌లో కేటీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తొందరపడాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్‌ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

బుధవారం ఎంసీఆర్‌డీలో విద్యాసంస్థల ప్రారంభంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరీంనగర్‌లో మాట్లాడుతూ సీఎంగా కేటీఆర్‌ పదవిని చేపట్టే ముహూర్తం విషయాన్ని కేసీఆర్‌ చూసుకుంటారన్నారు.

కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరం కట్టుబడి ఉంటామని, ఆయన మాటకు తిరుగులేదని స్పష్టం చేశారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కేటీఆర్‌ కొత్తపుంతలు తొక్కించారని ప్రశంసించారు. అయితే కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటూ మాట్లాడాల్సిందిగా ఎవరూ సూచనలు ఇవ్వలేదన్నారు. కానీ, సీఎం అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని భావిస్తున్నామన్నారు.

సీఎం పదవికి కేటీఆర్‌ సమర్థుడు: షకీల్‌, బాజిరెడ్డి, మెతుకు ఆనంద్‌

సీఎం పదవికి కేటీఆర్‌ అన్నివిధాలా సమర్థుడని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. యువనేత కేటీఆర్‌ను సీఎం చేయాలని తాను కోరుతున్నానని, ఇది తన సొంత అభిప్రాయమని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్‌ ఆధ్వర్యంలోనే జరగాలని తాను కోరుకుంటున్నానన్నారు. కేటీఆర్‌ సీఎం అయ్యేలా సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. తనతో పాటు చాలా మంది యువ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదేనన్నారు.

కాగా, కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు.

మంగళవారం డిచ్‌పల్లి మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్న వారిలో తాను కూడా ఒకడినన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.

కాగా, కేటీఆర్‌ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కూడా కేటీఆర్‌ సీఎం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.