తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ పోస్టర్, పార్టీ జెండాను బుధవారం కోదండరామ్ ఆవిష్కరించారు. బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ కాదని, జనం కోసం పనిచేసే పార్టీ అని ఆయన అన్నారు.
జెండాపై ఉన్న చిహ్నాల గురించి
పాలపిట్ట రంగు విజయానికి సంకేతమని, అమరుల స్థూపం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ జనం అని, ఆ తెలంగాణ జనం అమరుల స్ఫూర్తితో సంఘటితమవుతున్న సందర్భమే తెలంగాణ జన సమితి అని, ఆ అమరుల స్ఫూర్తితో కదులుతున్న జనం, ఆ చుట్టు మధ్యలో ఉన్నది అమరుల స్థూపంపై ఉన్నమల్లెపూవు అని, ఇంకా మధ్య ఉన్నఎరుపు అమరుల ఆకాంక్ష అని, అభివృద్దికి చిహ్నం ఆకుపచ్చ అని, నీలి రంగు దళిత సమాజానికి ప్రతీకని, పసుపు శుభానికి, విజయానికి సూచికమని… అదే తెలంగాణ జన సమితికి ఉన్నలక్ష్యమని కోదండరాం వివరించారు. పకృతి సహజసిద్ధంగా దొరికే రంగులు… బీర పువ్వు, పాలపిట్ట రంగు, కుంకుపువ్వు రంగు, తంగేడుపూల రంగు, గురుగుపూవు రంగు… వీటినే తెలంగాణ సమాజం ఇష్టపడుతుందని కోదండరామ్ వ్యాఖ్యానించారు.