సామాజిక న్యాయమే ధ్యేయం: కోదండరాం

437
TJS meeting success

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికే తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికార పార్టీ కి ఉద్యమ ఆకాంక్షలు సన్నగిల్లాయని, తెలంగాణ సెటిల్‌మెంట్ల రాజ్యంగా మారిందని ధ్వజమెత్తారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం మైదానంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయమే ధ్యేయంగా తాము పార్టీని స్థాపించామన్నారు. పాలకుల మార్పు కాదని.. పాలనలో మార్పు రావాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఏ ఒక్కరి పోరాటంతోనో తెలంగాణ రాలేదని, తెలంగాణ ఏ ఒక్కరి ఆస్తీ కాదని అన్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని ఆశించిన ప్రజలకు భంగపాటే మిగిలిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సమైక్య పాలనలో ఏం జరిగిందో.. ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 29) సాయంత్రం తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక బాధలు ఎదుర్కొన్న ప్రజలే సొంత ఖర్చులతో ఈ సభకు తరలివచ్చారని తెలిపారు.

‘రాష్ట్ర సంపదలో రైతులకు దక్కుతున్నది నూటికి ఏడు రూపాయలు మాత్రమే. అన్నదాతలు వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే పరిస్థితి లేదు. ఖాయిలపడిన పరిశ్రమల పునరుద్ధరణను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరాకృతి పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారు. నిరుద్యోగుల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. ప్రతి నోటిఫికేషన్‌ ఏదో ఒక లొసుగుతో కోర్టుల్లో నిలిచిపోతోంది’ అని కోదండరామ్ మండిపడ్డారు.

తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడిగా కోదండరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలంగాణ జనసమితి నేతలు, కార్యకర్తలతో సరూర్‌నగర్‌ స్టేడియం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.