రోజూ ఉదయాన్నే మనం తినే ఇడ్లీలకూ ఓ రోజు ఉందట..!

540
Tiffen

అవును.. మీరు చదివింది నిజమే. రోజూ ఉదయమే లొట్టలేసుకుంటూ తినే ఇడ్లీలకూ ఓ రోజు ఉంది. ఇడ్లీలనగానే మనకు గుర్తొచ్చేది తమిళనాడు. ఇడ్లీ సాంబార్ తమిళనాడులో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఎక్కువగా ఇడ్లీలు తినే తమిళులకు కూడా ఇడ్లీ డే ఒకటుందని తెలియకపోవచ్చు. పొద్దున్నే ఇడ్లీలు తిననిదే పొద్దుపోని వాళ్లకు కూడా ఇడ్లీ డే ఒకటుంటుందని తెలియకపోవచ్చు. మార్చి 30నే ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు.

గత మూడు సంవత్సరాల నుంచి మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇడ్లీ దినోత్సవానికి రూపకర్త ఎమ్ ఎనియావన్. మల్లిపూ ఇడ్లీ రెస్టారెండ్ ఫౌండర్. త‌మిళ‌నాడులో ఈ రెస్టారెంట్ ఫుల్లు ఫేమ‌స్‌. ఇడ్లీలు తినాలంటే అక్క‌డే తినాలి అంటారు.. అంత టేస్టీగా ఉంటాయ‌ట అక్క‌డి ఇడ్లీలు. ఈయనే మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా ప్రారంభించాడ‌ట.

మనకు ఫాథర్స్ డే, మధర్స్ డేలా అన్ని డేలు ఉన్నాయి. రోజూ పొద్దున్నే తినే ఇడ్లీలకు ఒక రోజు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాడు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు అందరూ ఇష్టపడే ఇడ్లీలకు ఒక రోజు ఉండాల్సిందే.. అని మార్చి 30 ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా నామకరణం చేశాడ‌ట.

అయితే.. ఇడ్లీ బిజినెస్‌లో ఉన్నవాళ్లలో చాలామందికి ఇడ్లీడే ఒకటుందని తెలియదట. దీని గురించి ఇప్పుడే తెలిసిందని చెబుతున్నారు. ఇడ్లీడే కాబట్టి.. ఈరోజు ఇడ్లీతో వెరైటీలు చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇక ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ సర్వీసులు స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్ లాంటి సంస్థలు ఇడ్లీ డే సందర్భంగా డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి.

ఎంతైనా ఇడ్లీ ఇడ్లీయే. ఇడ్లీ సాంబారు పేరుతో తమిళనాడులో పుట్టిన ఈ వంటకం.. ప్రస్తుతం సౌతిండియాలోనే కాదు.. ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మిమ్మల్ని ఇడ్లీ పలకరిస్తుంది. వేడి వేడి నాలుగు ఇడ్లీల మీద ఇంత నెయ్యి పోసుకొని.. గట్టి పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటే ఉంటది.. ఆహా.. ఆ మజాయే వేరు. ఇడ్లీ గొప్పతనం తెలిసే ఎనియావన్ అనే వ్యక్తి ఇడ్లీకి ఒక రోజు ఉండాలని నిర్ణయించాడు. నువ్వు గ్రేటప్పా.