ఏపీలో ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. విజయమే లక్ష్యంగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా అన్ని పార్టీల నేతలు చెమటోడ్చుతున్నారు. మరోవైపు, ఏ పార్టీ నేతలు ఏమి చెప్పినా… తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. పలు పథకాల ద్వారా సామాన్యులకు ప్రతి నెలా చెప్పిన తేదీ కల్లా ఏపీ ప్రభుత్వం చెక్కులను అందిస్తోంది. మరి కొన్ని పథకాల ద్వారా అబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ అవుతోంది.
ఇప్పుడు మళ్లీ కొత్త నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరే ఒకటో తేదీన పింఛను డబ్బులు జనాలకు అందనున్నాయి. 4వ తేదీన పసుపు-కుంకుమ చెక్కులు, 6వ తేదీన రైతు రుణమాఫీ చెక్కులు, 8వ తేదీన అన్నదాత సుఖీభవ చెక్కులు జనాలకు అందనున్నాయి. 9వ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, 10 రోజుల వ్యవధిలో జనాలకు అందనున్న ప్రభుత్వ పథకాలు టీడీపీకి మేలు చేస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.