టోక్యోకుచెందిన కానె తనాకా ప్రపంచంలో అత్యంత వృద్ధురాలట. ఆమె వయసు 116 సంవత్సరాలు. గిన్నిస్ బుక్ శనివారం ఈ సంగతి అదికారికంగా ప్రకటించింది. ఆ అవ్వ 1903 జనవరి 2న జన్మించారు. రైట్ సోదరులు విమానయానాన్ని ఆవిష్కరించిన సంవత్సరం కూడా అదే కావడం విశేషం. తనాకాకు ప్రపంచంలోని టాప్ వృద్ధురాలిగా గిన్నిస్ గుర్తింపు రావడంపై ప్రస్తుతం ఆమె నివసిస్తున్న జపాన్‌లోని ఫ్యుకువోకా పట్టణంలో మేయర్ సోయిచిరో తకషిమా ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
1922లో తనాకా హిడియోను పెళ్లాడారు. నలుగురు పిల్లలు పుట్టారు. ఐదో బిడ్డను దత్తత తీసుకున్నారు. అందరికన్నా పెద్దవ్వనని తనాకా ఊరికే మూలన కూర్చోరు. ఆమె ఇప్పటికీ గణితం, కాలిగ్రఫీ సాధన చేస్తారు. ఒథెల్లో గేమ్‌లో ఆమె సిద్ధహస్తురాలట. వృద్ధాశ్రమంలోని వారినందరినీ ఆమె చిటికెలో ఓడగొడతారట. జపనీస్ జీవన విధానంలోని గొప్పతనం ఏమిటో తెలియదుగానీ అక్కడి ఆయుర్దాయం ప్రపంచంలోనే అత్యధికం. అత్యంత వృద్ధులుగా క్కడివారే ఎక్కువగా రికార్డులు బద్దలు కొడుతుంటారు.