టెన్త్ పేపర్ లీక్ – నలుగురి సస్పెన్షన్

394
tenth class paper leak

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టి స్తోంది. ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలో ఓ టీచర్.. ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సప్ ద్వారా బయటకు పంపారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై.. ఎస్‌బీ పోలీసులకు సమాచారం అందించారు.

నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్న పత్రం లీకైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 10.30కు ప్రశ్నపత్రం బయటికి వచ్చింది. వాట్సప్‌లో పేపర్ క్లిప్పింగ్ బయటకు రావడంతో లీక్ విషయం బయటపడింది. పదో తరగతి పేపర్ లీక్ విషయం తెలిసి విద్యాశాఖ జిల్లా అధికారి(డీఈవో) జనార్థన్ రావు, ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డిలు తాడిహత్నూర్ పరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు తాడిహత్నూర్‌లో 240మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. అయితే, ఇంగ్లీష్ పేపర్ మొదటి పరీక్ష మొదలైన కాసేపటికే పేపర్ వాట్సప్‌లో ప్రత్యక్షమైందని వారు తెలిపారు. దీంతో లీకేజీ ఎలా జరిగిందనే విషయాన్ని పరీక్షించేందుకు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించామని వివరించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ ఎలా వచ్చిందన్న దానిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.



 

కేవలం ఒక్క సెంటర్‌లో మాత్రమే పేపర్ లీకేజీ కావడంతో దీన్ని మాల్ ప్రాక్టిస్ కిందే చూస్తామని, పేపర్ లీకేజీ కిందకు రాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ భరత్ చౌహన్‌తో పాటు ఇద్దరు డీవోలు పరీక్ష కేంద్రంలో బాధ్యుడైన ఇన్విజిలేటరుపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశారు. విద్యార్థులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా నిర్వహణ అధికారులు చర్యలు తీసుకొని పరీక్ష కేంద్రంలో పోలీసులతో బందోబస్తు నిర్వహించాలని సూచించారు. వారితో పాటు మండల విద్యాధికారి ఆశన్న, సీఐ హనూక్, ఎస్సై కృష్ణకుమార్ తదితరులు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.

వనపర్తి జిల్లాలోనూ టెంత్ ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు సమాచారం. కాగా, ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల డీఈఓలతో ఫోన్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మాట్లాడారు. పేపర్ లీకైన కేంద్రాలకు సంబంధించిన సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ లీకేజీ వ్యవహారంపై నాలుగు పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి.


ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు సూపర్‌వైజర్లతో పాటు విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ లీకేజీ ఆయా కేంద్రాలకే పరిమితం అయ్యిందా?, ఇతర కేంద్రాల్లో క్వశ్చన్ పేపర్ వెళ్లిందా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. విషయం తేలాకే.. పరీక్షను రద్దు చేయాలా? వద్దా? అనేది తేలనుంది. ఈ లీకేజీ తంతు ఇలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ పరీక్షను రద్దు చేస్తే.. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.